PMShri scheme పీఎంశ్రీ పథకానికి తెలంగాణలో 832 స్కూళ్లు

ఒక్కో స్కూల్ కు రూ.కోటి నుండి రూ.2.25 కోట్లు దాకా కేంద్ర నిధులొస్తాయి;

Update: 2025-07-08 05:01 GMT

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ చాలా అద్బుతమైన పథకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పథకం కింద ఎంపికైన ఒక్కో స్కూల్ కు రూ.90 లక్షల నుండి రూ.2.25 కోట్ల దాకా కేంద్రం నిధులిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే రాష్ట్ర పాలకుల్లో కొందరు మాత్రం కార్పొరేట్ సంస్థల పైసలకు అమ్ముడుపోయి వాళ్లకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం మండలాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వెంకట్రావుపల్లెలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన వేంకట్రావుపేట స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగించారు. ఏమన్నారంటే...

పీఎంశ్రీ పథకం కింద వెంకట్రావుపల్లె పాఠశాల ఎంపికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు మోదీ క్రుషి చేస్తున్నారు. యూపీఏ పాలనలో విద్యా రంగానికి బడ్జెట్ లో రూ.68 వేలు కోట్లు మాత్రమే కేటాయిస్తే, మోదీ ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలోనే 1.28 లక్షల కోట్లు కేటాయించింది. గత 11 ఏళ్లలో రూ.8 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు ఎంఈడీ, బీఈడీసహా టీచర్ కోర్సులన్నీ పాసైన వాళ్లే ఉంటారు. కానీ ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు అట్లా కాదు. అర్హతలు లేనివాళ్లే ఎక్కువ ఉంటారు. దురద్రుష్టమేందంటే ప్రభుత్వ స్కూళ్లలో అటెండర్లు కూడా లేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా విద్యా వ్యవస్థను మార్చాలనే ఆలోచన లేదు.

పీఎం శ్రీ కింద ఎంపికైన ప్రాథమిక పాఠశాలకు రూ.90 నుండి 1 కోటి వరకు, సీనియర్ స్కూల్ కు 2 కోట్ల నుండి 2.25 కోట్ల రూపాయల వరకు నిధులిస్తున్నం. ఈ నిధులవల్ల స్కూల్ కు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించవచ్చు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 14500 పాఠశాలలను పీఎంశ్రీ కింద చేర్చాలని నిర్ణయిస్తే, ఇప్పటి వరకు 13076 స్కూళ్లను ఎంపిక చేసినం. తెలంగాణలో 832 స్కూళ్లను పీఎంశ్రీ కింద ఎంపికై కేంద్ర నిధులు పొందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా సహకరిస్తున్నాయి. దురద్రుష్టమేమిటంటే చాలా చోట్ల రాష్ట్ర పాలకులు కార్పొరేట్ సంస్థల పైసలకు అమ్ముడుపోయి వాళ్లకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారు.

మోదీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యను అభ్యసించే వాళ్లతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వాళ్లకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్పులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. దీనిని వినియోగించుకుని దేశానికి సేవ చేయాలని, అంబేద్కర్, గాంధీ, సర్దార్ పటేల్, నరేంద్రమోదీ లా మారాలని కోరుతున్నా.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ స్కూళ్లను పీఎం శ్రీ పథకం కింద చేర్చేందుకు యత్నించిన. అట్లాగే అతి త్వరలో రాజన్న సిరిసిల్ల జిల్లాతోపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో నవోదయ, సైనిక స్కూళ్ల ఏర్పాటు చేయబోతున్నాం. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే టెన్త్ విద్యార్ధి, విద్యార్థులకు 20 వేల స్కూళ్లను ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. సీఎస్సార్ ఫండ్స్ కింద ఈ సైకిళ్లను కొనుగోలు చేసినం. ఈనెల 9 నుండి సైకిళ్ల పంపిణీ ప్రారంభించి నెలరోజుల్లో పూర్తి చేస్తాం. అట్లాగే ఆ తరువాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్ధిని, విద్యార్థులందరికీ స్కూల్ కిట్ బ్యాగ్స్ అందజేస్తాం.

Tags:    

Similar News