Minister Anagani Satyaprasad: ప్రైవేట్ భూములను 22ఏలో చేర్చితే చర్యలు.. 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ రిజిస్ట్రేషన్లకు అనుమతి: మంత్రి అనగాని సత్యప్రసాద్
మంత్రి అనగాని సత్యప్రసాద్
Minister Anagani Satyaprasad: నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ భూమిని 22ఏ జాబితాలో చేర్చితే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. గురువారం అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఏదైనా భూమిని 22ఏ జాబితాలో చేర్చేందుకు విధివిధానాలను స్పష్టం చేస్తూ జీవో నెం.445 జారీ చేశామని తెలిపారు. ఈ జీవో ప్రకారం ఏదైనా ప్రైవేట్ భూమిని 22ఏలో పెట్టాలంటే ఆ అధికారే దాన్ని నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కక్షపూరితంగా 22ఏలో చేర్చిన 28 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించామని గుర్తు చేశారు. ఈ జీవో వచ్చిన తర్వాత 28,790 ఎకరాలను తొలగించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో 1,100 ఎకరాలను ఇప్పటికే తొలగించామని, మిగిలిన వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. 22ఏ నుంచి భూముల తొలగింపును సులభతరం చేసేందుకు జీవో 444 కూడా జారీ చేశామని వివరించారు.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ‘మీ భూమి – బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ’ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు. ఈ ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలు చోటుచేసుకున్న 4 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని చెప్పారు.
దీర్ఘకాలికంగా శతాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. వట్టిచెరుకూరు, శెట్టిపల్లి, పుల్లడిగుంట, కంగుంది, అవులపల్లి, గూటుపల్లి, కోనసీమ జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో వేల మందికి వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు వస్తాయని మంత్రి వివరించారు.