Andhra Pradesh Cabinet: రామాయపట్నం పోర్టు జేఎస్‌డబ్ల్యూ చేతికి.. అమరావతి పనులకు మంత్రిమండలి ఆమోదం
| మంత్రిమండలి ఆమోదం
Andhra Pradesh Cabinet: నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణ కోసం డీబీఎఫ్ఓటీ విధానంలో జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ను పోర్టు ఆపరేటర్‌గా నియమించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన హైబ్రిడ్ మంత్రిమండలి సమావేశం ఆమోదించింది. స్థూల ఆదాయంలో 10.08 శాతం రెవెన్యూ షేర్ కోట్ చేసి జేఎస్‌డబ్ల్యూ హెచ్1గా నిలిచింది. గోధ్రా షిప్పింగ్-కాకినాడ సీపోర్ట్స్ కన్సార్షియం (5.51%), విశ్వసముద్ర ఇంజినీరింగ్ (4.5%) కూడా కోట్ చేశాయి. లెటర్ ఆఫ్ అవార్డు జారీ, రాయితీ ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ మారిటైం బోర్డుకు అనుమతి ఇచ్చింది. రాయితీ ఒప్పందం 30 ఏళ్లు, అనంతరం మరో 20 ఏళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.
రాజధాని అమరావతిలో రూ.8,613.15 కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, మొత్తం 30 అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రపంచబ్యాంకు, ఏడీబీ నిధులతో గ్రీన్ బఫర్, ల్యాండ్‌స్కేపింగ్, పబ్లిక్ పార్కు, అమరావతి మెమోరియల్ పార్కు అభివృద్ధికి రూ.180.68 కోట్లు, హైకోర్టు భవనానికి రూ.431.79 కోట్లు, శాసనసభ భవనానికి రూ.379.82 కోట్లు, సమీకృత సచివాలయం, జీఏడీ టవర్లకు రూ.6,641.21 కోట్లు, గ్రామ పంచాయతీల మౌలిక సదుపాయాలకు రూ.1,215.70 కోట్లు, అమరావతి సంగమం ప్రాజెక్టుకు రూ.626.14 కోట్లు కేటాయించారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో కియా ఇండియా రెండో ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం. రూ.19వేల కోట్ల పెట్టుబడులు, 12వేల ఉపాధి అవకాశాలు రానున్నాయి. అనకాపల్లి అచ్యుతాపురంలో సెయింట్ గోబైన్ ఫ్లోట్ గ్లాస్ ప్లాంట్‌కు రూ.1,800 కోట్ల పెట్టుబడి, 150 ఉపాధి కల్పనకు టైలర్‌మేడ్ ప్రోత్సాహకాలు ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 ముసాయిదాను పరిశీలించి, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు.
మంత్రిమండలి సమావేశం తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిలో వేగంగా పనులు జరుగుతుంటే వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని, రైతులపై కక్ష కట్టి ప్రపంచబ్యాంకు, ఏడీబీలకు పదేపదే ఫిర్యాదులు చేస్తోందని ఆగ్రహించారు. రైతుల త్యాగాన్ని ఎగతాళి చేస్తున్నారని, అమరావతి సాకారం కావడం వైసీపీకి ఇష్టం లేదని పేర్కొన్నారు. అమరావతి రైతుల పోరాటానికి గుర్తుగా స్మారకం చేపట్టాలని లోకేశ్ సూచించగా, సీఎం అంగీకరించారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఏపీకి మేలు చేస్తుందని, ప్రస్తుత సీట్ల సంఖ్యను 50 శాతం పెంచితే అన్ని రాష్ట్రాలకూ ఉపయోగమని అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్‌పై చర్చలకు నవంబర్ 29న ఢిల్లీకి వెళ్లాలని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. రుషికొండ ప్యాలెస్‌ను ఆతిథ్యరంగానికి ఇవ్వాలని సబ్ కమిటీ సూచించింది. 120 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌ను డిసెంబర్ 1న ప్రారంభిస్తామని, మిషన్ ఏర్పాటు చేసి సీఈవో నియమిస్తామని చెప్పారు. కొఠియా గ్రామాల వివాదంపై ఒడిసా సీఎస్‌తో మాట్లాడాలని సీఎస్‌ను ఆదేశించారు.