AP CID: ఏపీ సీఐడీ అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఛేదించింది.. 1400 సిమ్ కార్డులు స్వాధీనం

1400 సిమ్ కార్డులు స్వాధీనం

Update: 2025-12-25 06:57 GMT

AP CID: అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న భారీ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను ఏపీ సీఐడీ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కంబోడియా నుంచి ఆపరేట్ అయ్యే ఈ ముఠా భారత్‌లోని పలు రాష్ట్రాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతోంది. ఈ ఆపరేషన్‌లో 1400 సిమ్ కార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సీఐడీ అధికారుల ప్రాథమిక విచారణలో ఈ నెట్‌వర్క్ కంబోడియాను కేంద్రంగా చేసుకుని విశాఖపట్నం, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల్లో ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. సిమ్ బాక్స్‌లను ఉపయోగించి విదేశాల నుంచి వచ్చే కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి బాధితులను మోసం చేస్తున్నారు. బ్యాంక్ అధికారులు, పోలీసుల పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది.

డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సహకారంతో టెలికాం శాఖ నుంచి వచ్చిన సాంకేతిక సమాచారం, అనుమానాస్పద కాల్ ట్రాఫిక్ ఆధారంగా సీఐడీ సమగ్ర దర్యాప్తు చేపట్టింది. దీంతో సిమ్ బాక్స్‌ల ద్వారా జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు బయటపడ్డాయి.

ఈ కేసులో కీలక నిందితుడిగా వియత్నాం దేశానికి చెందిన హో హుడే అనే యువకుడిని పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేశారు. ఆయనే భారత్‌లో సైబర్ క్రైమ్ కార్యకలాపాలకు సంబంధించిన సిమ్ బాక్స్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులు, సాంకేతిక పరికరాలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో అంతర్జాతీయ ముఠాతో అతడికి ఉన్న సంబంధాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా సైబర్ నేరాలకు వినియోగించిన 1400 సిమ్ కార్డులను సీజ్ చేశారు.

ఈ భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించడం ద్వారా ప్రజలకు భద్రత కల్పించేందుకు సీఐడీ చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సైబర్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Tags:    

Similar News