Assistant Commissioner of Endowments: దేవాదాయ సహాయ కమిషనర్ శాంతి.. నిర్బంధ విరమణకు సన్నాహం
నిర్బంధ విరమణకు సన్నాహం
Assistant Commissioner of Endowments: దేవాదాయ శాఖలో వివాదాస్పదంగా మారిన సహాయ కమిషనర్ (ఏసీ) కె. శాంతి.. నిర్బంధ ఉద్యోగ విరమణకు దారి తీసే పరిస్థితులు ఏర్పడ్డాయి. వివిధ ఆరోపణల నేపథ్యంలో దేవాదాయ కమిషనర్ ఇటీవల జారీ చేసిన తాఖీదుకు ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేనట్లు సమాచారం. దీంతో ఒకటి రెండు రోజుల్లో ఆమె నిర్బంధ విరమణకు ఉత్తర్వులు జారీ కానున్నాయి.
వైకాపా ప్రభుత్వ హయాంలో శాంతి విశాఖపట్నం జిల్లా సహాయ కమిషనర్‌గా, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో దేవాదాయ శాఖ అధికారిగా పనిచేశారు. ఈ కాలంలో ఆమె నిబంధనలను ఉల్లంఘించినట్లు, దేవాదాయ ఆస్తులను పరిరక్షించడంలో విఫలమైనట్లు, ఆలయాలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వ్యక్తిగత జీవితంలో కూడా ఆమెపై విమర్శలు వచ్చాయి. మొదటి భర్త ఎం. మదన్‌మోహన్‌తో వివాహం జరిగినప్పటికీ, ఆయనతో విడాకులు తీసుకోకుండానే పి. సుభాష్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టులో ఆమెను సస్పెండ్ చేసి, ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. అయితే, తనపై ఉన్న ఆరోపణలకు శాంతి తగిన వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో గత నెల 16న దేవాదాయ కమిషనర్, నిర్బంధ విరమణ ఎందుకు చేయకూడదో 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని తాఖీదు జారీ చేశారు.
పాత వాదనలే పునరావృతం
ఇటీవల శాంతి తన వివరణను పంపగా, అందులో పాత వాదనలనే పునరావృతం చేశారు. నిబంధనల ప్రకారమే పనిచేశానని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని పేర్కొన్నారు. తన మొదటి భర్తతో చాలా కాలంగా విడిగా ఉంటున్నానని, అందుకే రెండో వివాహం చేసుకున్నానని వివరించారు. అయితే, ఈ వివరణలు దేవాదాయ కమిషనర్‌ను సంతృప్తి పరచలేదని తెలిసింది. విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వెంట్ నిబంధనలు-25కి విరుద్ధమని దేవాదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో, శాంతిని నిర్బంధ ఉద్యోగ విరమణకు గురి చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.