Minister Satyakumar: మంత్రి సత్యకుమార్‌కు బీజేపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు.. దక్షిణాది రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌గా నియామకం
ఇన్‌ఛార్జ్‌గా నియామకం
Minister Satyakumar: భారతీయ జనతా పార్టీ జాతీయ నేత, ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలకు దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌గా ఆయనను నియమించింది.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు బీజేపీ, ఎన్‌డీఏ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ అభియాన్ కొనసాగనుంది. ప్రజాసేవ, దేశాభివృద్ధి, ‘వికసిత్ భారత్–2047’ సంకల్పాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో వివిధ ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలను రూపొందించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాల సమన్వయం, అమలు, పర్యవేక్షణ బాధ్యతలను మంత్రి సత్యకుమార్ నిర్వహించనున్నారు.
ఈ అభియాన్‌లో భాగంగా ‘ఆశీర్వాద్ కా దియా’, ‘నమో సేవా గాథ’, ‘ఆంగన్ కా ఉత్సవ్’, ‘కహానీ బద్లావ్ కి’, ‘సేవా జ్యోతి యాత్ర’ వంటి పలు సేవా, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం.
ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరగనున్న రాష్ట్రవ్యాప్త కార్యశాలలో మంత్రి సత్యకుమార్ పాల్గొననున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చించి, అభియాన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.