Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికల్లో రెబల్‌ అభ్యర్థులుగా బరిలో నిలిస్తే పార్టీ నుంచి సస్పెన్షన్‌ వేటు తప్పదని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, కూటమి సమన్వయంపై పార్టీ ప్రముఖ నేతలతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

స్థానిక ఎన్నికల్లో రెబల్స్‌ బరిలో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. రెబల్‌ అభ్యర్థుల నామినేషన్లను వెంటనే ఉపసంహరింపజేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేన, భాజపా అధికారిక అభ్యర్థులు ఉన్న చోట కూడా రెబల్స్‌ లేకుండా చూడాలని కఠినంగా ఆదేశించారు. కూటమి పార్టీలతో మిత్రధర్మం పాటిస్తూ క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు.

స్థానిక ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదం పొందాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ప్రజలకు వివరించాలన్నారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ అనే నినాదంతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. టికెట్లు దక్కని ఆశావహులకు నామినేటెడ్‌ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని, ప్రజలకు నిజంగా సేవ చేసే మంచి అభ్యర్థులనే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు.కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కృషి చేయాలని, పార్టీ ఆదేశాలను ధిక్కరించేవారిపై చర్యలు తప్పవని సీఎం మరోసారి హెచ్చరించారు. టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Tags: