Chief Minister Nara Chandrababu Naidu: సీఎం చంద్రబాబు: స్థానిక ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువ సీట్లు ఇస్తాం
ఎక్కువ సీట్లు ఇస్తాం
Chief Minister Nara Chandrababu Naidu: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింగోలులో ‘మీ భూమి-మీ హక్కు’ గ్రామసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
గత 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా నిలిచారని, వారికి అండగా నిలవడం తన కర్తవ్యమని సీఎం అన్నారు. వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావడానికి తాము అనేక మార్పులు తీసుకొచ్చామని ఆయన గుర్తుచేశారు.
‘‘స్థానిక సంస్థల్లో బీసీలకు ఎన్టీఆర్ 24 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని నేను 34 శాతానికి పెంచాను. గత ప్రభుత్వం మళ్లీ 24 శాతానికి తగ్గించింది. దీంతో 16,800 మందికి స్థానిక ఎన్నికల్లో నాయకత్వ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పాం, ప్రయత్నించాం. 50 శాతానికంటే రిజర్వేషన్లు పెరుగుతున్నాయని చెబుతూ గొడ్డలి పార్టీ కోర్టుకెక్కింది. మేం ఒక కమిషన్‌ను నియమించి నివేదిక తెప్పించాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీలను ఆదుకుంటాం. ఆయా వర్గాలు బాగుపడితే తెదేపా బలపడుతుందనేది వైకాపా కుట్ర. నేను హామీ ఇస్తున్నా… స్థానిక ఎన్నికల్లో తప్పకుండా 34 శాతం కంటే ఎక్కువ సీట్లు పార్టీ పరంగా ఇస్తాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
బీసీలంటే వైకాపాకు గిట్టదని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనూ బీసీలకు రాజకీయ న్యాయం చేయడంలో పార్టీ వెనకాడదని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీపై కూడా సీఎం ప్రస్తావించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా వచ్చే మార్చిలోగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు 40,58,000 పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేశామని, అక్టోబర్‌లోనే 793 గ్రామాల్లో 4,58,000 మందికి, ఒక్క ప్రకాశం జిల్లాలోనే 24,116 పాస్‌పుస్తకాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం… చేస్తున్నాం అని ఆయన అన్నారు.