CM Chandrababu: రాజధాని అమరావతిలో కేవలం ప్రభుత్వ భవనాల నిర్మాణంపైనే దృష్టి పెట్టడం సరిపోదని, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా ఊపందుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

మంగళవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన 68వ సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) సమావేశం జరిగింది.ఈ సమావేశంలో 13 కీలక అంశాలకు ఆమోదం లభించింది.ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలని, ఇప్పటికే భూములు తీసుకున్న సంస్థలు వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేలా చూడాలని సీఎం ఆదేశించారు.

దేశంలోని ప్రముఖ స్థిరాస్తి సంస్థలతో సమావేశాలు నిర్వహించి, అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించాలని సూచించారు.సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణం బయటి నుంచి చూడటానికి ఐకానిక్‌గా ఉండాలని, లోపల వసతులను విలాసవంతంగా కాకుండా తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

సచివాలయ విభాగాధిపతుల కార్యాలయ టవర్లలో ఎంఈపీ పనుల సవరించిన అంచనాలకు, టెండర్లు దక్కించుకున్న సంస్థలకు ఎల్‌ఓఏలు జారీ చేసేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది.రాజధానిలోని 26 గ్రామాల్లో రూ.1,215.70 కోట్లతో రహదారులు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతుల కల్పనకు సవరించిన అంచనాలకు ఆమోదం లభించింది.

ఆ రహదారులను ఐదేళ్లపాటు గుత్తేదారు సంస్థలే నిర్వహించేలా నిబంధన విధించాలని సీఎం ఆదేశించారు.రాజధానిలో రూ.80 కోట్లతో గ్రీనరీ పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు.రాజధానికి వచ్చే రహదారుల వెంబడి కూడా గ్రీనరీ పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

రాజధాని వెంబడి కృష్ణా నది సుందరీకరణకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.రాజధాని రెండోదశ భూసమీకరణపై సీఎం సమీక్షించారు. సమీకరణ వేగంగా జరుగుతోందని అధికారులు వివరించారు.మొత్తం ఏపీ క్యాపిటల్ రీజియన్‌కు వర్తించేలా బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు అథారిటీ ఆమోదం తెలిపింది. భవనాలకు సంబంధించిన వివాదాలను ఈ ట్రైబ్యునల్ పరిష్కరిస్తుంది.

అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ), జంట టవర్ల నిర్మాణ ఖర్చును సీఆర్‌డీఏ భరిస్తున్నందున, వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని ఆ సంస్థకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చారు.అమరావతి ఎకనామిక్ రీజియన్ (ఏఈఆర్)గా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్రాంతంలో రూ.4.65 లక్షల కోట్ల పెట్టుబడుల పైప్‌లైన్ ఉంది.

క్వాంటమ్ వ్యాలీ, పోర్ట్ లీడ్ డెవలప్‌మెంట్, అగ్రికల్చర్ విల్యూ చెయిన్స్‌తో ఈ ప్రాంతం రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలకం కావాలని సీఎం భావిస్తున్నారు.ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేటు రంగం చురుకుగా ముందుకు రావాలని, అప్పుడే రాజధాని జీవం పోసుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే భూములు కేటాయించిన సంస్థలు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం గట్టిగా ఆదేశించారు. అమరావతిని కేవలం అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా కాకుండా ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలనే దిశగా ఈ నిర్ణయాలు ఉన్నాయి.

Tags: