CM Chandrababu Meets C.R. Patil: సీఎం చంద్రబాబు–సీఆర్ పాటిల్ భేటీ: పోలవరం, అమరజీవి జలధారకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి
విడుదల చేయాలని విజ్ఞప్తి
CM Chandrababu Meets C.R. Patil: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పథకం వివరాలను సీఎం వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు సకాలంలో విడుదల చేయాలని కోరారు.
వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా సాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టుకు ఎలాంటి నిధుల కొరత రాకుండా చూడాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. పోలవరం వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకు నీటిని నిలిపేందుకు అవసరమైన పునరావాసం, ఆర్ అండ్ ఆర్ పనులను త్వరితగతిన చేపడుతున్నట్లు సమాచారం అందించారు. గోదావరి నది నుంచి వేల టీఎంసీల వరద జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయని, వాటిని పట్టిసీమ ద్వారా సద్వినియోగం చేస్తున్న విషయాన్ని కూడా వివరించారు.
ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పెండింగులో ఉన్న అంశాలను పరిష్కరించాలని సీఎం కోరారు. పోలవరం నిర్మాణంలో భాగంగా ఆ రాష్ట్రాల్లో చేపట్టాల్సిన ప్రొటెక్టివ్ ఎంబాంక్‌మెంట్స్ పనులకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందనే కారణంతో అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఉపసంహరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ప్రక్రియను వేగవంతం చేయాలని, కేంద్ర జల మంత్రిత్వ శాఖ అధ్యక్షతన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో 95 లక్షల గ్రామీణ కుటుంబాల్లో ఇప్పటికే 62 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని సీఎం వివరించారు. తాజాగా 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు మంచినీటి కనెక్షన్లు అందించేలా జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాధాన్యతా పనులకు నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేసేలా చూడాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఐదు నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనాలపైనా చర్చ జరిగింది.