CM Chandrababu: రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు సాంప్రదాయ మార్గాలను విడిచి నిర్మాణాత్మక మార్పులు తీసుకురావాలని, జిల్లాల తలసరి ఆదాయం పెరిగేలా కలెక్టర్లు కొత్త ఆలోచనా విధానంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. గురువారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ‘లీడర్‌షిప్ – న్యూఏజ్ గవర్నెన్స్’ అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

‘ఎక్కడ ఏం చేస్తే రాబడి పెరుగుతుందో చూడాలి. విశాఖలో అనుకూల వాతావరణం వల్ల జీఎస్‌డీపీ పెరిగింది. బాపట్ల జిల్లాలోనూ అదే పరిస్థితి. సూర్యలంక బీచ్‌ను గోవాను మించి అభివృద్ధి చేయవచ్చు. కొన్ని జిల్లాల్లో అవకాశాలను ఇంకా సద్వినియోగం చేసుకోవడం లేదు. ప్రణాళిక శాఖ సూచించిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ అని సీఎం అన్నారు. వాడపల్లి ఆలయం ఒక మంచి ఉదాహరణగా పేర్కొంటూ, అక్కడ ప్రస్తుతం రూ.50 కోట్ల ఆదాయం వస్తున్నట్లు, మౌలిక సౌకర్యాలు పెంచితే ఏడాదికి రూ.100 కోట్ల వరకు రాబడి రావచ్చని తెలిపారు. స్థానిక జాతరలు, ఉత్సవాలను బాగా ప్రమోట్ చేసి, సందర్శకులు రెండు-మూడు రోజులు ఉండేలా వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.

తొలి త్రైమాసికంలో విశాఖలో 38.49 శాతం, బాపట్లలో 37.20 శాతం, ప్రకాశంలో 34.09 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమస్యలు పరిష్కరించి ఖాయిలా పడిన వాటిని తిరిగి పనిచేయించాలని, దీనికోసం ప్రత్యేకాధికారిని నియమించాలని సీఎం అన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై ఆ శాఖ ప్రధాన కమిషనర్ ఎ.బాబు ప్రజెంటేషన్ ఇచ్చారు.

ప్రజల ఆశలు, అంచనాలకు అనుగుణంగా కలెక్టర్లు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పాలనలో టెక్నాలజీని అందిపుచ్చుకొని వేగవంతమైన ఫలితాలు సాధించాలని, ఏఐ ద్వారా డేటాను విశ్లేషించి పొరపాట్లు లేకుండా ఫలితాలు సాధించాలని చెప్పారు. నాయకత్వం స్వీయ ప్రేరణతో ముడిపడి ఉంటుందని, ప్రతి నాయకుడు తన బృందాన్ని ప్రభావవంతంగా నిర్మించడం ద్వారానే ఫలితాలు వస్తాయని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త నాయకత్వ విధానాలతో ముందుకు సాగాలని సీఎం కోరారు.

Tags: