Viveka Murder Case: వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిపై ఈడీ విచారణ.. రూ.40 కోట్ల మూలాలపై 8 గంటలపాటు ప్రశ్నలు
8 గంటలపాటు ప్రశ్నలు
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం విచారించారు. ఈ నెల 12న దాదాపు 11 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించిన ఈడీ బృందం.. మరోసారి రమ్మని ఆదేశించడంతో హైదరాబాద్‌లోని కార్యాలయంలో గురువారం విచారణకు హాజరయ్యారు. 8 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించిన అధికారులు ప్రధానంగా వివేకా హత్య కోసం వెచ్చించాలనుకున్న రూ.40 కోట్లు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనుకున్నారు? అంత డబ్బు వెచ్చించడానికి సిద్ధమైన వ్యక్తులెవరు? హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులకు అడ్వాన్సుగా చెల్లించిన డబ్బు ఎక్కడిది? అంత భారీ నగదు ఎలా సమకూరింది? వంటి అంశాలపైనే ప్రశ్నించినట్లు సమాచారం.
వివేకా హత్యకు కొన్ని నెలల ముందు, ఆ తర్వాత నిర్వహించిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఈ నెల 12న జరిగిన విచారణ సందర్భంగా కొన్ని పత్రాలు తీసుకుని మళ్లీ విచారణకు రావాలని శివశంకర్‌రెడ్డికి ఈడీ అధికారులు సూచించారు. ఆ పత్రాలతో గురువారం నాటి విచారణకు ఆయన హాజరయ్యారు. వివేకా హత్యకు కుట్ర రూపకల్పన, నిధులు సమకూర్చారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిలను వరుసగా విచారించిన ఈడీ అధికారులు.. వారిచ్చిన సమాధానాలను ముందుపెట్టి శివశంకర్‌రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. వాటికి ఆయన సరిగ్గా సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది.
విచారణకు హాజరుకాని ఎంపీ అవినాష్‌రెడ్డి
వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరుకాలేదు. బుధవారం ఆయన్ను విచారించిన ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొన్ని పత్రాలు తీసుకుని రావాలని సూచించగా.. అవి కడపలో ఉన్నాయని కొంత సమయమిస్తే తీసుకొస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. మళ్లీ ఆయన ఈడీ ఎదుట ఎప్పుడు హాజరవుతారనేది స్పష్టత లేదు.