CM Chandrababu: ప్రతి నెల మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను వసతిగృహాలకు ఆహ్వానించి, అక్కడి పరిస్థితులు, వసతులు, మెరుగుదలలు వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌పై సోమవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు.

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పౌరసేవలు మెరుగుపడాలని, ప్రభుత్వ శాఖలు చొరవ చూపాలని సీఎం సూచించారు. వెలిగొండ ప్రాజెక్టు, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవాలకు ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ పూర్తయి కృష్ణా జలాలు చేరడంతో ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందని, ప్రతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తే సానుకూల ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ వంటి అంశాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో తాను 20 సార్లు పాల్గొన్నట్లు వెల్లడించారు. అన్న క్యాంటీన్ల ద్వారా దాతల సాయం అందే అంశంపై దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ శాఖలన్నీ ఆన్‌లైన్‌ సేవలు అందించాలని, సమీకృత సేవల విధానం ద్వారా నిర్ణయాలు త్వరగా తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సహా వివిధ విభాగాలు ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లోనే జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో స్థితిగతులపై ‘అవేర్‌’ ద్వారా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి రైతులకు సూచనలు ఇవ్వాలని, ఉద్యాన పంటలను కాపాడుకోవటానికి ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags: