Home Minister Anitha: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై చర్చించాలని సవాల్ విసిరారు.

బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హోంమంత్రి అనిత మాట్లాడారు. “రోడ్లపై తిరుగుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ కంటే పెద్ద వేదిక ఏదైనా ఉందా?” అని ప్రశ్నించారు. జగన్ రాజకీయాలు పక్కనపెట్టి అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సూచించారు. గెలిచిన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వారి హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని అనిత స్పష్టం చేశారు. “ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని జగన్‌కు డీఎస్సీ అక్రమాల గురించి మాట్లాడే హక్కు లేదు” అని సూటిగా చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే డీఎస్సీపై తొలి సంతకం చేసి సుమారు 16 వేల మందికి టీచర్ ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. అభ్యర్థుల కష్టాన్ని అవమానించేలా ఆరోపణలు చేయకూడదని, ఉద్యోగాలు సాధించిన వారి మనోభావాలను దెబ్బతీయవద్దని హితవు పలికారు. ప్రతి ఆరోపణకు అధికారులు ఆధారాలతో సమాధానం ఇచ్చారని, కోర్టుల్లో కూడా వైసీపీ ఆరోపణలు ఎదురుదెబ్బ తిన్నాయని పేర్కొన్నారు.

ప్రజల్లో అలజడి సృష్టించడమే లక్ష్యంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ వెనుక వైసీపీ భయం కనిపిస్తోందని, లోకేశ్‌ను రాజకీయంగా బదనాం చేయడమే జగన్ లక్ష్యమని విమర్శించారు. లోకేశ్ నాయకత్వంలో పారదర్శకంగా పాలన సాగుతోందని, 16 వేల మందికి నియామక పత్రాలు అందజేసి ఉద్యోగాల్లోకి పంపామని చెప్పుకొచ్చారు. ఎంపికైన అభ్యర్థులతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించామని, ఉద్యోగాలు పొందిన వారితో రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు.

Tags: