Jagan's Roadshow: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా జాతీయ రహదారులపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని జైలులో కలవడానికి వచ్చిన జగన్‌తో పాటు వందలాది వాహనాలు, కార్యకర్తలు రోడ్‌షో నిర్వహించడంతో బెంగళూరు (ఎన్‌హెచ్-44), తిరుపతి (ఎన్‌హెచ్-40) జాతీయ రహదారులు గంటల తరబడి నిలిచిపోయాయి.

పోలీసులు జాతీయ రహదారిపై రోడ్‌షో లేదా జనసమీకరణకు అనుమతి ఇవ్వలేదు. విమానాశ్రయం నుంచి పంచలింగాల జైలు వరకు కేవలం జగన్‌ వాహనశ్రేణికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినా జగన్‌ వందల వాహనాలతో రోడ్‌షో చేశారు. ఓర్వకల్ విమానాశ్రయం నుంచి పంచలింగాల వరకు 36 కి.మీ. దూరం సాధారణంగా అరగంటలో చేరుకోవచ్చు. కానీ జగన్‌ మార్గమధ్యలో ఆగి ప్రజలకు అభివాదం చేస్తూ, కార్యకర్తలు భారీ క్రేన్లు పెట్టి గజమాలలు, హారతులు ఇవ్వడంతో నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది.

రోడ్లపై డీజేలు, నిలువెత్తు జెండాలు, నృత్యాలు, మద్యం తాగి ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు పీకి భారీ శబ్దాలతో అల్లరి చేశారు. వాహనాలను అడ్డుకుంటూ రహదారులను నిరోధించారు. జగన్‌ ఎస్కార్ట్‌ వాహనాన్ని కూడా ఒక కార్యకర్త ద్విచక్ర వాహనం ఢీకొన్నాడు. కర్నూలు రూరల్‌ సీఐ చంద్రబాబునాయుడు వాహనాలను సరిగా పంపాలని ప్రయత్నించగా కార్యకర్తలు అడ్డంపడి వాగ్వాదానికి దిగారు. నన్నూరు టోల్‌ప్లాజా వద్ద కొందరు సీసీ కెమెరాను ధ్వంసం చేశారు.

జాతీయ రహదారిపై రోజూ 30 వేలకు పైగా వాహనాలు తిరుగుతాయి. కార్యకర్తల వాహనాలు అడ్డదిడ్డంగా రావడం, వందల మంది రాంగ్‌ రూట్‌లో ప్రయాణించడంతో రెండు వైపులా ట్రాఫిక్‌ స్తంభించింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోప్‌పార్టీ పోలీసులు జనాలను వెనక్కి నెట్టాలని ప్రయత్నించినా వీలుకాలేదు. జైలు దగ్గర కూడా వందల మంది కార్యకర్తలు దూసుకొచ్చి కేకలు వేశారు. జిల్లా జైలు ప్రాంతంలో భారాస జెండాలు, పోస్టర్లు, కేటీఆర్‌ పోస్టర్లతో కొందరు హడావుడి చేశారు.

జగన్‌ విలేకర్లతో మాట్లాడుతున్నప్పుడు కూడా కార్యకర్తలు రప్పారప్పా అంటూ కేకలు వేశారు. అనుమతులు లేకపోయినా జరిగిన ఈ రోడ్‌షోతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని స్థానికులు చెబుతున్నారు.

Tags: