Chandrababu–Pawan Meeting: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మధ్య మంగళవారం కీలక సమావేశం జరిగింది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉదయం 9.30 నుంచి దాదాపు రెండు గంటలపాటు ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 100 శాతం సీట్లు గెలవాలని, స్థానాల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై స్పష్టమైన వ్యూహం రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

ఈ భేటీలో స్థానిక ఎన్నికల్లో కూటమి అనుసరించాల్సిన వ్యూహం, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, మేయర్‌, జడ్పీటీసీ, చైర్‌పర్సన్‌ స్థానాల కేటాయింపు వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడే ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని, స్నేహపూర్వక పోటీలు నివారించాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని స్థానిక సంస్థల్లోనూ పునరావృతం చేయాలని, ఓటు శాతం, సీట్ల సంఖ్యలో అప్పటికంటే ఎక్కువ సాధించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలపైనా చర్చ జరిగింది. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా స్థానాల సర్దుబాటు, అభ్యర్థుల జాబితాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. జనసేన పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాల జాబితాను పవన్‌ కల్యాణ్‌ సీఎంకు అందజేసినట్లు సమాచారం.

పవన్‌ కల్యాణ్‌తో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు కూటమి సమన్వయ కమిటీలో తెదేపా తరఫున ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోని పురపాలక సంఘాల ఛైర్మన్‌ పదవులతోపాటు 50 శాతం వార్డులను ఆ పార్టీ కోరుతోందని వారు వివరించారు. అలా చేస్తే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ మధ్య సమన్వయం సులభమవుతుందని జనసేన భావనగా తెలిపారు. బీజేపీ మాత్రం తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేని ప్రాంతాల్లో పోటీ చేసి పార్టీ బలాన్ని పెంచుకోవాలని భిన్నంగా ఆలోచిస్తోందని సమాచారం.

ఏ పార్టీకి ఎక్కడ ఎక్కువ బలముంది, ఎక్కడ ఎవరు పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తాం అన్నదే స్థానాల సర్దుబాటుకు ప్రాతిపదిక కావాలని సీఎం స్పష్టం చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో సమన్వయ కమిటీల సమావేశాలు పూర్తయ్యాయని, బుధవారం మరోసారి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి కసరత్తును కొలిక్కి తెస్తామని పల్లా, నిమ్మల సీఎంకు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఆశావహుల జాబితాలు సిద్ధం చేయాలని, రిజర్వేషన్లు ఖరారైన తర్వాత అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తల చేరిక సమయంలో అప్రమత్తంగా ఉండాలని, కూటమి పార్టీల మధ్య పొరపొచ్చాలకు దారి తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేయాలని ఇరువురు అగ్రనేతలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

Tags: