Gorantla Butchaiah Chowdary: కొడాలి నాని, వంశీ మాటలు అదుపులో పెట్టుకోలేదు.. ఇప్పుడు ఫలితాలు ఎదుర్కొంటున్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఇప్పుడు ఫలితాలు ఎదుర్కొంటున్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Gorantla Butchaiah Chowdary: ఎన్ని ఇబ్బందులొస్తేను, అవమానాలెదురైనా కూటమి దృఢంగా కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. ముందుచూపుతో కూడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరిని ఉపయోగించి పవన్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు వైఎస్సార్‌సీపీ చేస్తోందని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఏమీ చేయలేదు. జగన్ నియంతగా వ్యవహరించారు. గోదావరి నదిపై దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తప్పు ఏముంది? అధికారంలో లేనప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం కేసీఆర్‌కు అలవాటు. ఆయన నాకంటే జూనియర్. కేసీఆర్ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను కేసీఆర్, జగన్ పరిష్కరించడానికి అడ్డుకున్నారు. ఇటీవల తెలుగు యూనివర్సిటీ సమస్యను మేం పరిష్కరించాం. వైఎస్సార్‌సీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ నోటి దురుసుగా మాట్లాడకుండా ఉండాలని గతంలోనే సూచించాను. నా మాట వినకపోవడంతో ఇప్పుడు వారు దాని ఫలితాలను అనుభవిస్తున్నారు” అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.