Local Body Election: స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. 28న మున్సిపల్ పోలింగ్
మున్సిపల్ పోలింగ్
Local Body Election: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా వెంటనే అమల్లోకి వచ్చింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించనున్నారు. శుక్రవారం (16న) నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభమవుతుంది. అక్టోబరు 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు ప్రకటన జరుగుతుంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అక్టోబరు 21న నామినేషన్లు ప్రారంభం. నవంబరు 3న పోలింగ్, 5న ఫలితాలు. గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో నవంబరు 26, 29, డిసెంబరు 2న పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రతి విడతలోనూ పోలింగ్ రోజునే ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.
123 పట్టణ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ప్రకటించినా 100 చోట్లకే నోటిఫికేషన్ జారీ అయింది. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలు, 19 పురపాలక సంఘాలకు డిసెంబరులో ప్రత్యేక నోటిఫికేషన్ రావచ్చు.
మహా విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చారు. మిగతా 11 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలకు మరో రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఫలితాలు ప్రకటించాక 60 రోజుల వరకు బ్యాలెట్ పత్రాలు భద్రపరచాలి.