Minister Parthasarathi: కేసీఆర్‌కు మంత్రి పార్థసారథి కౌంటర్
మంత్రి పార్థసారథి కౌంటర్
ఇష్టానుసారం మాట్లాడొద్దు.. పెట్టుబడులపై అనుమానాలుంటే రండి, పారదర్శకంగా చూపిస్తాం
Minister Parthasarathi: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భాషాపటిమ, యాసపై మంచి పట్టు ఉన్నా ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏపీకి వస్తున్న పెట్టుబడులపై కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరమని, అవి తగవని ఆయన విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే పలుసార్లు ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు.
మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. ‘‘ఏపీకి వస్తున్న పెట్టుబడులపై కేసీఆర్‌కు ఏమైనా సందేహాలు ఉంటే స్వయంగా వచ్చి చూసుకోవచ్చు. మేం పూర్తి పారదర్శకతతో అన్నీ చూపిస్తాం. ఆ పెట్టుబడిదారులు తెలంగాణలోనూ భారీగా ఇన్వెస్ట్ చేశారన్న విషయం కేసీఆర్‌కు తెలియదా? హైదరాబాద్‌కు బలమైన పునాదులు ఉన్నాయి, మీరు దాన్ని మరింత అభివృద్ధి చేశారు కావచ్చు. కానీ ఇక్కడ అమరావతి పునాదులే లేని పరిస్థితుల్లో, వైకాపా ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం నుంచి బయటపడుతూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాం. ఇలాంటి సమయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం శోభనీయం కాదు’’ అని మంత్రి స్పష్టంగా తేల్చి చెప్పారు.