Minister Satyakumar Yadav: జగన్‌ పాలనలో 104, 108 సేవలు పీపీపీతోనే నడిచాయి కదా?

పీపీపీతోనే నడిచాయి కదా?

Update: 2025-12-17 12:24 GMT

వైద్య కళాశాలల పీపీపీ విధానంపై వైకాపా ఆందోళన విడ్డూరం: మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

Minister Satyakumar Yadav: వైద్య కళాశాలల నిర్వహణలో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) మోడల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కోటి సంతకాల సేకరణ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రాద్ధాంతం చేస్తున్న వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆ పార్టీ నేతలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పి. సత్యకుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ప్రైవేటీకరణకు, పీపీపీ విధానానికి మధ్య ఉన్న తేడాను కూడా వారు అర్థం చేసుకోలేదని ఆయన విమర్శలు గుప్పించారు. కోర్టుకు వెళ్తామంటూ జగన్‌ చేస్తున్న హెచ్చరికలపై నిలబడాలని సవాల్‌ విసిరారు.

సచివాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. ‘‘జగన్‌ పాలనలో రాష్ట్రంలో 104, 108 అంబులెన్స్‌ సేవలతో పాటు క్యాథ్‌ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, పోర్టుల నిర్వహణ పీపీపీ విధానంలోనే జరిగాయి కదా? ఇప్పుడు ఏమైంది?’’ అని ప్రశ్నించారు. ‘‘సెజ్‌ల ఏర్పాటు, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం, ఫ్రీహోల్డ్‌ పేరుతో లక్షల ఎకరాల భూములను ఆక్రమించిన వారు పీపీపీ గురించి మాట్లాడటం అత్యంత విడ్డూరం. కోటి సంతకాల సేకరణలో తమ కార్యకర్తలే ఎడమ, కుడి చేతులతో సంతకాలు పెట్టలేక అల్లాడుతున్నారని వైకాపా నేతలే అంటున్నారు’’ అని ఎద్దేవా చేశారు.

పీపీపీ విధానం లాభాలను మంత్రి ఇలా వివరించారు: ‘‘ప్రభుత్వమే భూమిని కేటాయిస్తుంది. యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి. భూమిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. వైద్య సీట్లు పెరుగుతాయి. నిర్వహణ మాత్రమే ప్రైవేటు సంస్థలు చూసుకుంటాయి.’’ జగన్‌ స్వంత జిల్లాలో చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని మూసివేయించి, సిమెంటు పరిశ్రమలను కూడా మూయించి, వాటి స్థానంలో సొంత పరిశ్రమలు పెట్టుకున్నారని ఆరోపించారు.

ప్రతి ఒక్కరికీ ఆరోగ్య హక్కు కల్పించే చట్టం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘రైట్‌ టు హెల్త్‌’ చట్టం తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం నిర్వహించిన సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలో ‘సంజీవని’ పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద 90 వేల మందికి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేసి, వారి ఆరోగ్య సమస్యలను మ్యాపింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి గురించి మంత్రి ఇలా చెప్పారు: ‘‘ఈ వ్యాధి ఎప్పటి నుంచో ఉంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 12 వేల పరీక్షలు నిర్వహించగా, 1,600 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి.’’ మానసిక ఆరోగ్యం, డిజిటల్‌ ఇన్నోవేషన్‌, ఏఐ టూల్స్‌ ఉపయోగించి నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయాలపై సీఎంతో చర్చించినట్లు వివరించారు.

Tags:    

Similar News