Pawan Kalyan’s Key Remarks: పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు: భయపడకండి.. వైసీపీ పాలన మళ్లీ రాదు!

భయపడకండి.. వైసీపీ పాలన మళ్లీ రాదు!

Update: 2025-12-23 05:24 GMT

నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతకు భంగం కలగనివ్వను

ప్రజాస్వామ్యం బలోపేతమయ్యే వరకు కూటమి కలిసికట్టుగా పనిచేయాలి

అధికారులు బెదిరింపులకు లొంగకుండా శాంతిభద్రతలు కాపాడాలి

Pawan Kalyan’s Key Remarks: ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మళ్లీ వైసీపీ పాలన రాబోదని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీని పేరుచెప్పడం కూడా ఇష్టం లేనంతగా ఆ పార్టీ రౌడీల సమూహంలా కనిపిస్తోందని, వారి విధానాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తామని, అవసరమైతే చొక్కా మడిచి ముందుకు వస్తామని హెచ్చరించారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం జనసేన పార్టీ నేతలతో ‘పదవి-బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. ప్రభుత్వంలో పదవులు పొందిన నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

“పాత ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన తేడా ఉండాలి. శాంతిభద్రతలు రాష్ట్రంలో అతి ముఖ్యం. అధికారులు ఎవరి బెదిరింపులకూ లొంగకుండా ధైర్యంగా చర్యలు తీసుకోవాలి. మంచి పోలీసు అధికారులకు ప్రజలు అండగా నిలబడాలి. నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీసే శక్తులను అడ్డుకుంటాను” అని పవన్ ధీమాగా ప్రకటించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడితే అరాచకం రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. “మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి వచ్చి చంపేస్తామని, పోలీసులకు చూపిస్తామని బెదిరిస్తున్నారంటే.. అది తప్పుడు సంకేతాలు. పెట్టుబడులు, పర్యాటకం కూడా దెబ్బతింటాయి. ఎవరూ భయపడకండి.. మళ్లీ ఆ పాలన రాదు. ప్రజాస్వామ్యం బలోపేతమయ్యే వరకు కూటమి ఐక్యంగా ఉండాలి” అని పిలుపునిచ్చారు.

జనసేన నేతలకు హెచ్చరికలు చేస్తూ.. “కూటమి ప్రభుత్వంలో 3,459 మంది జనసేన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చాం. క్షేత్రస్థాయిలో పోరాడినవారిని, పార్టీ కోసం కష్టపడినవారిని గుర్తించాం. అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు. భూముల పంచాయితీలు, తప్పుడు సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకోను. ప్రతి ఒక్కరూ తమ పదవి ద్వారా ప్రజలకు మంచి చేయాలి” అని సూచించారు.

జనసేనను జాతీయ దృక్పథం ఉన్న ప్రాంతీయ పార్టీగా అభివర్ణిస్తూ.. పార్టీ సిద్ధాంతాలు, పోరాట పటిమే ఈ విజయాలకు కారణమని పవన్ కల్యాణ్ వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News