Lokesh: రాయలసీమ వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు.. గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఐఎస్ఏతో ప్రాంత రూపురేఖలు మారనున్నాయి: మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్
Lokesh: రాయలసీమ రైతుల సత్తా ఇకపై ప్రపంచం చూడబోతోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (జీహెచ్‌హెచ్), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్‌ఏ) ద్వారా రాయలసీమ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని తెలిపారు. మదనపల్లెలో ఏర్పాటు కానున్న ఐఎస్‌ఏ ప్రపంచస్థాయి సంస్థగా ఎదుగుతుందని, దేశవిదేశాలకు కావాల్సిన పంటలను రాయలసీమలో పండించనున్నట్లు వెల్లడించారు.
‘యువగళం’ పాదయాత్రలో రాయలసీమను ఉద్యానహబ్‌గా మార్చే బాధ్యత తీసుకుంటానని అప్పుడే చెప్పానని, కడపలో ‘మిషన్ రాయలసీమ’ పేరుతో డిక్లరేషన్ ఇచ్చానని లోకేశ్ పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచడమే దాని లక్ష్యమని అన్నారు. తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల వల్లనే రాయలసీమ అరటి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతోందని, కరవు ప్రాంతానికి కియా మోటర్స్ వచ్చిందని గుర్తు చేశారు.
అప్పట్లో ఐఎస్‌బీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లుగానే ఇప్పుడు సీమలో ఐఎస్‌ఏ ఏర్పాటు కానుందని లోకేశ్ అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి ముకేశ్ అంబానీని ముంబయిలో చంద్రబాబు కలిసి వివరించగా.. ఏపీలో పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. అంబానీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉందని, అనంత్ అంబానీ ఇకపై ఆంధ్రప్రదేశ్ బిడ్డ అని కూడా అన్నారు.
రాబోయే మూడేళ్లలో రాయలసీమలో ప్రభుత్వం రూ.40,352 కోట్లు, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో ఎంవోయూ కుదిరింది. మదనపల్లె సమీపంలో 100 ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది.