Mp Keineni : విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో సమస్యల పరిష్కారించండి
రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ కు ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి;
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని, అమృత భారత స్టేషన్ 2.0 పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్దికి నీతి ఆయోగ్ మంజూరు చేసిన నిధులను రైల్వే శాఖ ద్వారా త్వరితగతిన విడుదల చేయించాలని రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ కు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారు. రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ ను న్యూఢిల్లీ రైల్ భవన్ లోని ఆయన కార్యాలయంలో ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం కలిశారు. .ఈ సందర్బంగా విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ దృష్టికి ఎంపీ కేశినేని శివనాథ్ తీసుకు వెళ్లారు.
విజయవాడ రైల్వే డివిజన్‌లో పెండింగ్ లో వున్న లెవెల్ క్రాసింగ్ నెం. 316 (విజయవాడ – గుణదల), లెవెల్ క్రాసింగ్ నెం. 147 (రాయనపాడు-కొండపల్లి), లెవెల్ క్రాసింగ్ నెం. 148 (విజయవాడ–రాయనపాడు), లెవెల్ క్రాసింగ్ నెం.8 (విజయవాడ -రామవరప్పాడు), వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు, రోడ్ అండర్ బ్రిడ్జ్‌లు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అలాగే అమృత భారత స్టేషన్ 2.0 పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్దికి నీతి ఆయోగ్ మంజూరు చేసిన రూ.836.47 కోట్ల నిధులను రైల్వే శాఖ త్వరితగతిన విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. ఎంపీ కేశినేని శివనాథ్ చేసిన విజ్ఞప్తులపై రైల్వే బోర్డ్ చైర్మన్ సతీష్ కుమార్ సానుకూలంగా స్పందించటమే కాకుండా సంబంధింత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.