Governor Quota MLC Posts: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎస్సీ, బీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించనున్నారు.

ఈ స్థానాలకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, రాయలసీమ ప్రాంతం నుంచి అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. త్వరలోనే వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

తెదేపా సీనియర్ నాయకుడు వర్ల రామయ్య గతంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున పోటీ చేశారు.

ఇదే సమయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పీడీఎఫ్ అభ్యర్థిగా ఎం.హనుమంతరావును ప్రకటించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హనుమంతరావు 30 ఏళ్లపాటు ఉపాధ్యాయుడిగా సేవలందించి గత జూన్‌లో పదవీ విరమణ పొందారు. ఏపీ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్)లో మండల ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు పనిచేశారు. ఆయన అభ్యర్థిత్వానికి యూటీఎఫ్ మద్దతు ప్రకటించింది.

Tags: