Nara Lokesh: టీడీపీ బలం, బలగం కార్యకర్తలే.. మైటీడీపీలో 10 లక్షల మంది నమోదు: నారా లోకేశ్ హర్షం
| నారా లోకేశ్ హర్షం
Nara Lokesh: మైటీడీపీ యాప్‌లో నమోదైన తెదేపా కార్యకర్తల సంఖ్య 10 లక్షలకు చేరుకోవటంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో భాగస్వాములైన వారందరికీ ‘ఎక్స్’ వేదికగా బుధవారం అభినందనలు తెలిపారు. ‘కార్యకర్తే అధినేత, కార్యకర్తే తెదేపాకు బలం.. బలగం. పార్టీకి, కార్యకర్తలకు మధ్య డిజిటల్ వారధిగా రూపొందించిన మైటీడీపీ యాప్‌లో నమోదైన తెదేపా కుటుంబ సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవటం గర్వకారణం. క్షేత్రస్థాయిలో కార్యకర్తల కష్టానికి గుర్తింపు లభిస్తుంది’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
‘మైటీడీపీ’ యాప్‌లో 10 లక్షల మంది నమోదవటం ప్రాంతీయ పార్టీల డిజిటల్ ప్రయాణంలో ఓ అరుదైన మైలురాయి అని తెదేపా అభివర్ణించింది. మంత్రి లోకేశ్ చొరవతో యాప్‌ను రూపొందించినట్లు తెలిపింది. ‘యాప్‌లో అధినేత మొదలు గ్రామస్థాయి కార్యకర్త వరకు అనుసంధానమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ పిలుపు మేరకు చేపట్టే కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, సేవా కార్యకలాపాలను ఎప్పటికప్పుడు తెదేపా శ్రేణులు ఇందులో నమోదు చేస్తున్నాయి. సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లో యాప్ క్రియాశీల పాత్ర పోషిస్తోంది’ అని పేర్కొంది.
ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సంఖ్యపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయాణంలో ఇదో కీలక మైలురాయి అని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ‘సభ్యత్వ నమోదుకే పరిమితం కాకుండా ‘మైటీడీపీ’ యాప్.. పార్టీ అధినాయకత్వం, క్షేత్రస్థాయి కార్యకర్తలకు మధ్య బలమైన వారధిగా నిలుస్తోంది. భారీస్థాయిలో యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవటం పార్టీ శ్రేణుల అంకితభావం, సాంకేతిక చైతన్యానికి నిదర్శనం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మైటీడీపీ యాప్ ద్వారా కార్యకర్తలు తమ కార్యక్రమాలు, సేవా కార్యకలాపాలు, ఇంటింటి ప్రచారాలను రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో పార్టీ అధినాయకత్వం క్షేత్రస్థాయి పనితీరును నేరుగా పర్యవేక్షించగలుగుతోంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కార్యకర్తలు ఒకే వేదికపై అనుసంధానమవుతున్నారు. ఈ డిజిటల్ వారధి కార్యకర్తల కష్టానికి గుర్తింపు ఇవ్వడంతో పాటు పార్టీ బలం పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు.
తెదేపా శ్రేణుల్లో సాంకేతిక చైతన్యం పెరుగుతోందని, భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ కార్యక్రమాలు చేపడతామని పార్టీ ప్రకటించింది. 10 లక్షల మంది నమోదు ఒక రికార్డు స్థాయి సాధనగా భావిస్తున్నారు.