Veligonda Phase-I: వెలిగొండ తొలి దశ జాతికి అంకితం.. కరవు నేలపై కృష్ణమ్మ కొత్త చరిత్ర రాశాం: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
Veligonda Phase-I: మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, పైలాన్‌ను ఆవిష్కరించి, స్థానిక రైతులతో కలిసి గేట్లు ఎత్తి నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేశారు.
తొలి దశ ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలు నల్లమలసాగర్‌కు చేరుతాయి. మొదటి విడతలో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, నాలుగు లక్షల మందికి తాగునీరు అందనున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. శ్రీశైలం జలాశయం నుంచి గురుత్వాకర్షణ ద్వారా నీటిని తరలించి నల్లమలసాగర్‌లో నిల్వ చేసి కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ప్రాజెక్టును రూపొందించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ, 1996లో భూమిపూజ చేసిన 30 ఏళ్ల తర్వాత తొలి దశను ప్రారంభించి జాతికి అంకితం చేశానని అన్నారు. ‘‘మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను. పునాది వేశాను.. ప్రాజెక్టును పూర్తి చేశానని సగర్వంగా చెబుతున్నాను. నాడు చేసిన సంకల్పం నేడు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారింది. ఇది భగీరథ ప్రయత్నం. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన ప్రజలకు, నిర్వాసితులకు పాదాభివందనం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
2019లో గొడ్డలి పార్టీ రాకతో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టిందని, గత ప్రభుత్వంలో కేవలం 2.77 శాతం పనులు మాత్రమే జరిగాయని సీఎం విమర్శించారు. నిర్వాసితులకు జీవో ఇచ్చి అరకొర చెల్లింపులతో మోసం చేశారని, ఎన్నికల ముందు ఫేక్ ప్రచారాలు, డ్రామాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం రాకతో గ్రహణం వీడిందని, ప్రధాని మోదీ, మిత్రుడు పవన్ కల్యాణ్ సహకారంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ‘‘కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర ఇది. వెలిగొండ బంగారు కొండ అవుతుంది. ఫ్లోరైడ్ అనే పదం మరచిపోతాం. ఇక ఆ పరిస్థితులు ఉండవు’’ అని ఉద్ఘాటించారు.
నదుల అనుసంధానమే నీటి సమస్యకు ఏకైక పరిష్కారమని సీఎం అన్నారు. పోలవరాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, వెలిగొండ ఫేజ్-2ను 2028 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. గోదావరి నీళ్లు కూడా నల్లమలసాగర్‌కు రావాలని, ఎల్లుండే పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి, అనంతరం వంశధార వరకు తీసుకెళ్తామని చెప్పారు. రాబోయే కృష్ణా పుష్కరాలను మార్కాపురంలో కూడా వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. నల్లమలసాగర్ నుంచి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరిస్తామని, రూ.లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌లో మార్కాపురాన్ని భాగం చేశామని పేర్కొన్నారు.
‘‘నాకు రాజకీయం అంటే ఎన్నికలు కాదు.. ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడం. ఓట్లు ఆశించి కాదు.. మార్పు ఆశించి పనిచేస్తా. నెక్ట్స్ ఎన్నికల కోసం కాదు.. నెక్ట్స్ జనరేషన్ కోసం పనిచేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం కష్టపడతా. అందరం కలిసి తెలుగు జాతిని ప్రపంచంలోనే నంబర్ వన్ చేద్దాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, ఎంపీ శ్రీనివాస రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు హాజరయ్యారు.