Speaker Ayyanna Patrudu: సభకు రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు?.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్న
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్న
Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వకూడదని, వారి వేతనాలు వెనక్కి తీసుకునేలా పార్లమెంటులో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఈ అంశంపై తనకు ఇంకా సమాధానం రాలేదని ఆయన తెలిపారు.
మంగళవారం తునిలో విలేకర్లతో మాట్లాడుతూ, కొద్దిరోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభకు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరిస్తారనే నమ్మకంతో జగన్‌ను గెలిపించారని గుర్తు చేశారు. కొందరు వైకాపా ఎమ్మెల్యేలు సభలోకి రాకుండానే బయట సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని ఆయన ఆరోపించారు.
దొంగ సంతకాలను అరికట్టేందుకు ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను ప్రవేశపెట్టామని స్పీకర్ చెప్పారు. కొత్త విధానం ప్రకారం ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే ఆటోమేటిక్ కెమెరాలు ఆన్ అవుతాయి. అప్పుడే వారిని హాజరైనట్లు లెక్కలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆరు నెలల పాటు సభకు రాకపోతే అనర్హత వేటు వేసే అంశం చర్చల స్థాయిలో ఉందని, దీనిపై కేంద్రం ఎలాంటి మార్గనిర్దేశం చేస్తుందో చూస్తున్నామని అన్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు క్వార్టర్స్ కేటాయింపుపై సాధారణ పరిపాలన శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
అమరావతిలో మీడియా సమావేశం నిర్వహిస్తూ స్పీకర్ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘సభకు రానివాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉన్నారు? ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరుకాకపోవడమేంటి? అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలి?’’ అని ప్రశ్నించారు. సభకు రాని వారికి వేతనాలు ఇవ్వకూడదని, ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరిగి చట్టం తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఈ నెల 14, 15 తేదీల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పీకర్ ప్రకటించారు. విద్యార్థులతో పాటు ఎవరైనా పాల్గొనవచ్చని, సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 17న జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.డీఎస్సీపై జగన్, వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉద్యోగం సాధించినవారిని హేళన చేస్తున్నారని స్పీకర్ విమర్శించారు. క్రీడా కోటాలో అన్యాయం జరిగిందంటున్న జగన్‌కు అసలు ఆ కోటా అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన నచ్చకపోతే జనమే ప్రభుత్వాన్ని మారుస్తారని, అంతే తప్ప మార్చడానికి జగన్ ఎవరని సమాధానమిచ్చారు.