World Elephant Day: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. మానవ-ఏనుగు సంఘర్షణ తగ్గింపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
World Elephant Day: ఏనుగులు అడవుల సంరక్షణకు, జీవవైవిధ్యానికి కాపలాదారులు, దేశ వారసత్వానికి ప్రతీకలు అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం విశాఖలో ఏర్పాటైన ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారని పవన్ తెలిపారు. 2014 నుంచి ఏనుగుల రిజర్వుల సంఖ్య 26 నుంచి 33కు పెరిగింది. 150 ఏనుగుల కారిడార్లు గుర్తించి రక్షణ కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 132 నుంచి 142 అడవి ఏనుగులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
పలమనేరు, పార్వతీపురం మన్యం ప్రాంతాల్లో మానవ-ఏనుగు సంఘర్షణ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకతో కలిసి చర్యలు చేపట్టామని పవన్ చెప్పారు. కర్ణాటక నుంచి నాలుగు కుంకీలను తీసుకొచ్చి ముసలివాగులో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కుంకీల సహాయంతో 50కి పైగా సంఘర్షణ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి, ఏనుగుల వల్ల జరిగే మానవ మరణాలను 70 శాతం వరకు తగ్గించగలిగామని ఆయన గర్వంగా ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ‘హనుమాన్’ కార్యక్రమంలో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, ఏడు వన్యప్రాణుల అంబులెన్స్‌లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 200కు పైగా వన్యప్రాణులను రక్షించగా, 30కు పైగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. ఏనుగుల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఉద్యమంగా మారాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.