Sedan Cars : హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ స్కోడా స్లావియా..సెడాన్ కార్ల సామ్రాజ్యంలో అసలైన కింగ్ ఎవరు ?
సెడాన్ కార్ల సామ్రాజ్యంలో అసలైన కింగ్ ఎవరు ?
Sedan Cars : భారతదేశంలో లగ్జరీ, రాయల్ లుక్‌ను ఇష్టపడే కార్ల ప్రియులకు సెడాన్ కార్లంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా దేశంలో దశాబ్దాలుగా సెడాన్ సెగ్మెంట్‌ను ఒంటిచేత్తో శాసించిన ఏకైక బ్రాండ్ హోండా సిటీ. అయితే, ఈ మధ్య కాలంలో స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి యూరోపియన్ కార్ల ఎంట్రీతో హోండా సిటీ హవా కాస్త తగ్గింది. దీంతో పోగొట్టుకున్న తన రాజసాన్ని మళ్లీ సొంతం చేసుకోవడానికి జపనీస్ కార్ల దిగ్గజం హోండా.. సరికొత్త లుక్, అల్ట్రా మోడ్రన్ ఫీచర్లతో 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లోకి దించింది. మరి ఈ నయా హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. పవర్‌ఫుల్ స్కోడా స్లావియాకు గట్టి పోటీ ఇవ్వగలదా? ఈ రెండింటిలో మైలేజ్, ఫీచర్లు, సేఫ్టీ పరంగా ఏది బెస్ట్ ఆప్షనో తెలుసుకుందాం.
ధరల యుద్ధం.. ఎవరి బడ్జెట్ ఎంత?
మొదట ధరల విషయానికి వస్తే.. ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం స్కోడా స్లావియా ప్రారంభ ధర రూ.10 లక్షల నుంచి గరిష్టంగా రూ. 17.99 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు, కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.12 లక్షల నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ మోడల్ రూ.21 లక్షల వరకు పలుకుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. హోండా సిటీలో లభించే హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల దాని టాప్ వేరియంట్ ధర చాలా ఎక్కువ. స్కోడా స్లావియా టాప్-ఎండ్ మాంటే కార్లో 1.5 DCT వెర్షన్ కంటే హోండా సిటీ హైబ్రిడ్ మోడల్ ఏకంగా రూ.3 లక్షలు ఎక్కువ ధరను కలిగి ఉంది. అయితే, మీరు కేవలం నాన్-హైబ్రిడ్ పెట్రోల్ టాప్ మోడల్స్ (రూ. 17.15 లక్షలు) మాత్రమే పోల్చి చూస్తే.. హోండా సిటీనే స్లావియా కంటే దాదాపు రూ.85,000 తక్కువ ధరకు లభిస్తుంది.
సైజ్, క్యాబిన్ స్పేస్
కొలతల పరంగా చూస్తే ఈ రెండు కార్ల మధ్య ఆసక్తికరమైన పోటీ ఉంది. 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ తన కొత్త బంపర్ డిజైన్ కారణంగా 4,594 మిమీ పొడవుతో ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత పొడవైన కారుగా నిలిచింది. కానీ, స్కోడా స్లావియా మాత్రం హోండా సిటీ కంటే ఎక్కువ వెడల్పు (1,752 మిమీ), ఎక్కువ ఎత్తు (1,507 మిమీ), పెద్ద వీల్‌బేస్ (2,651 మిమీ) కలిగి ఉంది. దీనివల్ల స్కోడా స్లావియా లోపల ప్రయాణీకులకు షోల్డర్ రూమ్, లెగ్‌రూమ్ చాలా లగ్జరీగా అనిపిస్తుంది. పైగా బూట్ స్పేస్ విషయంలో కూడా స్కోడా స్లావియా 521 లీటర్ల సామర్థ్యంతో హోండా సిటీ (506 లీటర్లు) కంటే 15 లీటర్లు అదనపు స్థలాన్ని అందిస్తోంది.
కలర్ ఆప్షన్లు, ప్రీమియం లుక్
కలర్స్ విషయానికొస్తే రెండు కార్లలోనూ అబ్సిడియన్ బ్లూ, రేడియంట్ రెడ్, క్రిస్టల్ బ్లాక్, సిల్వర్, గ్రే వంటి దాదాపు ఒకే రకమైన ప్రీమియం రంగులు లభిస్తాయి. అయితే, స్కోడా స్లావియా తన ప్రత్యేకమైన మాంటే కార్లో ఎడిషన్‌లో క్యాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, చెర్రీ రెడ్ రంగులతో పాటు బ్లాక్ కలర్ రూఫ్‌తో కూడిన డ్యూయల్-టోన్ ఆప్షన్‌ను అందిస్తూ యువతను బాగా ఆకట్టుకుంటోంది.
360-డిగ్రీ కెమెరాతో హోండా సిటీ అప్డేట్
ఫీచర్ల పరంగా ఈసారి హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. స్కోడా స్లావియాను దాటేసి ముందంజలో నిలిచింది. స్కోడా స్లావియాలో కేవలం ఫ్రంట్ పవర్డ్ సీట్లు (ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్) మాత్రమే అదనపు ఫీచర్‌గా ఉంటే.. కొత్త హోండా సిటీలో 360-డిగ్రీ కెమెరా, వెనుక ప్యాసింజర్ల కోసం విండ్‌స్క్రీన్ సన్‌షేడ్స్, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్ వంటి హైటెక్ ఫీచర్లను లోడ్ చేశారు.
మైలేజ్ లో 27 కిమీల రికార్డు
రక్షణ, మైలేజ్ విభాగంలో హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ తిరుగులేని విజేతగా నిలిచింది. ఇందులో అడ్వాన్స్‌డ్ లెవెల్-2 అడాస్ సేఫ్టీ కిట్‌ను అందించారు. ఇది హైవేలపై కారును ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తూ ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఇక ఇంజన్ల విషయానికి వస్తే.. స్కోడా స్లావియాలో ఉండే 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లు డ్రైవింగ్ చేసేటప్పుడు అద్భుతమైన స్పోర్టీ ఫీలింగ్‌ను, రాకెట్ లాంటి వేగాన్ని ఇస్తాయి. కానీ, హోండా సిటీ లోని 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్ మాత్రం నడకలో చాలా స్మూత్‌గా ఉండటమే కాకుండా.. ఏకంగా లీటరుకు 27.26 కిమీల మైండ్ బ్లాకింగ్ మైలేజ్ ఇస్తుంది.
అంటే.. మీకు అదిరిపోయే పవర్, లాంగ్ వీల్‌బేస్, స్పోర్టీ లుక్ కావాలంటే స్కోడా స్లావియా బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా వరల్డ్ క్లాస్ అడాస్ సేఫ్టీ, ఎక్కువ ఫీచర్లు, లీటరుకు 27 కిమీల టాప్ మైలేజ్ కావాలనుకుంటే మాత్రం 2026 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కు మించిన కారు లేదు.