Mercedes-Benz : కేవలం 2.1 సెకన్లలోనే 100 కిమీ స్పీడు.. మెర్సిడెస్ నుంచి సూపర్ కార్
మెర్సిడెస్ నుంచి సూపర్ కార్
Mercedes-Benz : ప్రపంచ ప్రసిద్ధ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్, ఆటోమొబైల్ రంగాన్ని షేక్ చేసే సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ కారును అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. తన పవర్‌ఫుల్ రేసింగ్ విభాగం నుంచి 2026 మెర్సిడెస్-ఏఎమ్‌జీ జీటీ 4-డోర్ కూపే మోడల్‌ను అఫీషియల్‌గా అన్‌వీల్ చేసింది. ఇప్పటివరకు వచ్చిన ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్ కార్లలోనే ఇది అత్యంత శక్తివంతమైన వాహనంగా నిలవనుంది. కేవలం రెప్పపాటు కాలంలో.. అంటే 2.1 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ కారు ప్రత్యేకత.
ఈ సరికొత్త ఏఎమ్‌జీ జీటీ ఎలక్ట్రిక్ కారును రెండు పవర్‌ఫుల్ వేరియంట్లలో కంపెనీ డిజైన్ చేసింది. దీని టాప్ మోడల్ అయిన GT 63 ఏకంగా 1,169hp పవర్ను జనరేట్ చేస్తుంది. అలాగే దీని బేస్ మోడల్ GT 55 వేరియంట్ 816 hp పవర్‌ను ఇస్తుంది. బ్రిటీష్ కంపెనీ YASA భాగస్వామ్యంతో తయారు చేసిన సరికొత్త తేలికపాటి ఆక్సియల్ ఫ్లక్స్ ఎలక్ట్రిక్ మోటార్లను ఇందులో వాడారు. జీటీ 63 మోడల్‌లో మొత్తం మూడు మోటార్లు ఉంటాయి (రెండు వెనుక, ఒకటి ముందు). దీనివల్ల కారు రోడ్డుపై బుల్లెట్‌లా దూసుకుపోవడమే కాకుండా, మలుపుల్లో అద్భుతమైన గ్రిప్‌ను అందిస్తుంది.
ఈ కారు సరికొత్త AMG.EA ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్, 800V అడ్వాన్స్‌డ్ ఆర్కిటెక్చర్‌పై పనిచేస్తుంది. ఇది ఏకంగా 600kW డీసీ (DC) ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో కారులోని బ్యాటరీ కేవలం 11 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ అయిపోతుందని మెర్సిడెస్ సవాల్ చేస్తోంది. అంటే మనం హైవేపై ఒక టీ తాగి వచ్చే లోపే కారు ఫుల్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఇక రేంజ్ విషయానికి వస్తే, సింగిల్ ఛార్జ్‌పై ఈ కారు ఏకంగా 700 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఎలక్ట్రిక్ కారైనా సరే, ఏఎమ్‌జీ మార్క్ స్పోర్టీ లుక్ ఎక్కడా తగ్గకుండా దీని బాడీని డిజైన్ చేశారు. పొడవైన వీల్‌బేస్, వెడల్పైన వీల్స్, అగ్రెసివ్ ఫ్రంట్ లుక్ కారుకు లగ్జరీ అప్పీల్‌ను ఇస్తాయి. ముందు భాగంలో వెలిగిపోయే ఏఎమ్‌జీ స్పెషల్ ఇల్యూమినేటెడ్ గ్రిల్, స్టార్ షేప్‌లో ఉండే ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు కళ్లు చెదిరేలా ఉన్నాయి. వెనుక వైపు టర్బైన్ చక్రాల డిజైన్ లాంటి రౌండ్ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్, స్పీడ్‌ను బట్టి ఆటోమేటిక్‌గా పైకి లేచే యాక్టివ్ రియర్ స్పాయిలర్ ఉన్నాయి.
కారు లోపల అడుగుపెడితే ఏదో స్పేస్ షిప్‌లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది. డాష్‌బోర్డ్ మొత్తం ఒకే ఒక పెద్ద గ్లాస్ ప్యానల్‌తో కవర్ అయి ఉంటుంది. ఇందులో డ్రైవర్ కోసం 10.2-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే సెంటర్‌లో డ్రైవర్ వైపు కొద్దిగా వంగి ఉండే 14-ఇంచుల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే ఉన్నాయి. రేసింగ్ కార్లలో లాంటి ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, కలర్‌ఫుల్ యాంబియంట్ లైటింగ్, కారు పర్ఫార్మెన్స్ మోడ్స్‌ను మార్చుకోవడానికి AMG రేస్ కంట్రోల్ అనే ప్రత్యేక రోటరీ బటన్లు ఉన్నాయి. దీని అంచనా ధర అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.3.30 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.