Skoda Slavia: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా తన మోస్ట్ పాపులర్ సెడాన్ స్లావియా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా ఆవిష్కరించింది. వెనుక సీట్లకు మసాజ్ ఫంక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ వంటి మైండ్ బ్లాకింగ్ ఫీచర్లతో వచ్చిన ఈ కారు బుకింగ్స్ కేవలం రూ.15,000కే ప్రారంభమయ్యాయి. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో తన ప్రత్యేకతను చాటుకున్న స్కోడా స్లావియా ఇప్పుడు మరింత లగ్జరీ లుక్‌తో సరికొత్తగా ముస్తాబైంది. ఇందులో చేసిన మార్పులలో అత్యంత ముఖ్యమైనది వెనుక సీట్లకు అందించిన మసాజ్ సదుపాయం. దూరప్రాంతాలకు ప్రయాణించేవారికి ఇది అమితమైన సౌకర్యాన్ని అందిస్తుంది. దీనితో పాటు భద్రత, డ్రైవింగ్ సౌలభ్యం కోసం 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లతో కూడిన పార్క్ పైలట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డ్రైవర్ ముందుకు పెద్దగా కనిపించేలా 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను సైతం అమర్చారు.

సరికొత్త స్లావియాలో 10.1 అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తోంది. ఇందులో గూగుల్ క్లౌడ్ ఆటోమోటివ్ ఏఐ ఏజెంట్ ఆధారంగా పనిచేసే అడ్వాన్స్‌డ్ వాయిస్ అసిస్టెంట్‌ను పొందుపరిచారు. జెమిని ఏఐ సహకారంతో డ్రైవర్, ప్రయాణికులు కేవలం తమ వాయిస్ కమాండ్స్ ద్వారానే తాజా వార్తలు, సంగీతం, ఫోన్ కాల్స్, క్లైమేట్ కంట్రోల్ వంటి విధులను ఎంతో సులువుగా నిర్వహించవచ్చు. ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఈ కారు ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి.

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ మోడల్ క్లాసిక్, క్లాసిక్+, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మోంటే కార్లో అనే ఆరు విస్తృత వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటిలో స్పోర్టీ లుక్ ఇచ్చే మోంటే కార్లో మోడల్ ప్రారంభం నుంచే లభించనుంది. క్యాండీ వైట్, కార్బన్ స్టీల్, లావా బ్లూ, చెర్రీ రెడ్ వంటి ప్రామాణిక రంగులతో పాటు ఆర్క్టిక్ సిల్వర్, క్యాపుచినో బైజ్ అనే రెండు సరికొత్త రంగులను కూడా కంపెనీ పరిచయం చేసింది.

ఇంజన్ విషయానికి వస్తే స్కోడా రెండు శక్తివంతమైన పెట్రోల్ ఆప్షన్లను కొనసాగిస్తోంది. మొదటిది 1.0-లీటర్ టర్బో టిఎస్ఐ ఇంజన్ 113 బిహెచ్‌పి పవర్, 178 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. దీనికి పూర్వపు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో సరికొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇక రెండవది పవర్‌ఫుల్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 148 బిహెచ్‌పి పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది. ఇది 7-స్పీడ్ డిఎస్‌జి డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 1.5 లీటర్ వేరియంట్‌లో వెనుక చక్రాలకు డిస్క్ బ్రేకులు ఇచ్చి భద్రతను మరింత పెంచారు.

Tags: