Tata Tiago iCNG : సీఎన్జీ కార్లలోనే మొదటిసారి.. పెడల్ షిఫ్టర్స్ ఫీచర్‌తో 2026 టాటా టియాగో

పెడల్ షిఫ్టర్స్ ఫీచర్‌తో 2026 టాటా టియాగో

Update: 2026-05-27 11:23 GMT

Tata Tiago iCNG : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సురక్షితమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త సంచలనానికి సిద్ధమైంది. దేశంలో రోజురోజుకూ సిఎన్‌జి కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు టాటా టియాగోను అల్ట్రా మోడ్రన్ ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందులో భాగంగా మోస్ట్ అవైటెడ్ 2026 టాటా టియాగో ఐ-సిఎన్‌జి సరికొత్త అధికారిక టీజర్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. మే 28న ఈ కారు ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించబోతోంది. అయితే, అంతకంటే ముందే విడుదలైన ఈ టీజర్ కార్ లవర్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు ఏ సిఎన్‌జి కారులోనూ లేని విధంగా రోటరీ డ్రైవ్ సెలెక్టర్, పెడల్ షిఫ్టర్స్ లాంటి మైండ్ బ్లోయింగ్ ఫీచర్లను ఈ నయా మోడల్‌లో జోడించారు.

సాధారణంగా లగ్జరీ స్పోర్ట్స్ కార్లలో లేదా రేసింగ్ కార్లలో మాత్రమే కనిపించే పెడల్ షిఫ్టర్స్ టెక్నాలజీని టాటా సంస్థ ఈ బడ్జెట్ సిఎన్‌జి కారులోకి తీసుకురావడం విశేషం. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారులో స్టీరింగ్ వీల్ వెనుక చిన్నపాటి లివర్లు ఉంటాయి. వీటి సహాయంతో డ్రైవర్ క్లచ్ తొక్కే పని లేకుండా, కనీసం గేర్ రాడ్‌ను కూడా తాకకుండా కేవలం చేతి వేళ్లతోనే గేర్లను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. సిఎన్‌జి కార్లలో ఈ తరహా రేసింగ్ ఫీల్ అందించడం ఇదే మొదటిసారి. అంతకుముందు టాటా పంచ్ ఐ-సిఎన్‌జిలో మాత్రమే ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఇప్పుడు టియాగోలో కూడా ఈ ఫీచర్ రానుండటంతో మారుతి వ్యాగన్ఆర్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి ప్రత్యర్థి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.

కంపెనీ విడుదల చేసిన నయా టీజర్ ప్రకారం.. 2026 టాటా టియాగో ఐ-సిఎన్‌జి ఇంటీరియర్, కేబిన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కారు లోపల అడుగుపెట్టగానే మునుపటి కంటే చాలా పెద్దదైన ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. దీనితో పాటు లగ్జరీ కార్ల స్టైల్‌లో ఉండే ఫ్లోటింగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, సరికొత్త టూ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్‌ను అమర్చారు. కారు లోపల మరింత ప్రీమియం లుక్ రావడం కోసం బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్‌లో సరికొత్త డ్యూయల్-టోన్ సీట్ అప్హోల్‌స్టరీని అందించారు. కారు కేబిన్ చూస్తే ఇది బడ్జెట్ కారా లేక లగ్జరీ సెడాన్ కారా అనే డౌట్ రాక మానదు.

టాటా టియాగో సెంటర్ కన్సోల్‌లో కూడా భారీ మార్పులు జరిగాయి. పాతకాలపు గేర్ లివర్ స్థానంలో జగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లలో లాంటి మోడ్రన్ రోటరీ డ్రైవ్ సెలెక్టర్‎ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్, మొబైల్స్ వేగంగా ఛార్జ్ చేసుకోవడానికి 65W టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, ఒకేసారి రెండు ఫోన్లను ఛార్జ్ చేసుకునే వీలుగా డ్యూయల్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ వంటి క్రేజీ ఫీచర్లను ఇందులో జోడించారు. కారు బయట వైపు కూడా సరికొత్త హెడ్‌ల్యాంప్‌లు, అప్‌డేటెడ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ బంపర్, టెయిల్‌గేట్‌పై మెరిసిపోయేలా ఐ-సిఎన్‌జి బ్యాడ్జింగ్‌ను ఇచ్చారు. ఇరుకైన సందుల్లో కూడా కారును ఈజీగా పార్కింగ్ చేయడం కోసం ఈసారి 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌ను కూడా అందించడం విశేషం.

భారతదేశంలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‌జి టెక్నాలజీతో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆఫర్ చేస్తున్న ఏకైక కంపెనీ ప్రస్తుతానికి టాటా మోటార్స్ మాత్రమే. కస్టమర్ల ఛాయిస్ ప్రకారం ఈ టియాగో కారు పెట్రోల్, సిఎన్‌జి, ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్లలో విక్రయించబడనుంది. ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం.. ఈ సరికొత్త 2026 టాటా టియాగో ఐ-సిఎన్‌జి బేస్ మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ.6.80 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. మే 28న కంపెనీ దీని అధికారిక ధరలను, వేరియంట్ల వివరాలను బయటపెట్టనుంది. మిగతా బ్రాండ్ల కంటే తక్కువ ధరకే ఈ రేంజ్ లగ్జరీ ఫీచర్లను అందిస్తే మాత్రం సిఎన్‌జి కార్ల మార్కెట్లో టాటా టియాగో తిరుగులేని రికార్డులు సృష్టించడం ఖాయం.

Tags:    

Similar News