Triumph Motorcycles : ఇండియాలో మూడు సరికొత్త ప్రీమియం బైక్‌లను లాంచ్ చేసిన రాయల్ ట్రయంఫ్
ప్రీమియం బైక్‌లను లాంచ్ చేసిన రాయల్ ట్రయంఫ్
Triumph Motorcycles : బైక్ లవర్స్‌కు పూనకాలు తెప్పించే రేంజ్ లగ్జరీ బైక్‌లు మార్కెట్లోకి వచ్చేశాయి. బ్రిటీష్ మోటార్‌సైకిల్ దిగ్గజం ట్రయంఫ్ సరికొత్త అప్‌డేట్స్‌తో ఇండియన్ మార్కెట్లో తన జెండా పాతేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న తన మూడు ప్రీమియం బైక్‌ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 2026 బోనెవిల్లే టి120 మోడల్‌తో పాటు క్లాసిక్ లుక్ ఉన్న బోనెవిల్లే బాబర్, బోనెవిల్లే స్పీడ్‌మాస్టర్ బైక్‌లు ఉన్నాయి. కంపెనీ తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ కొత్త ధరలు, అదిరిపోయే ఫీచర్లను అప్‌డేట్ చేసింది. పాత మోడళ్లతో పోలిస్తే వీటి డిజైన్, రైడింగ్ కంఫర్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.
ట్రయంఫ్ బోనెవిల్లే టి120 బైక్ తన పాత క్లాసిక్ అప్పీల్‌ను అలాగే ఉంచుకుంటూనే కొన్ని మోడ్రన్ మార్పులతో అదరగొడుతోంది. ఇందులో చేసిన అతిపెద్ద మార్పు ఏంటంటే.. సరికొత్త ఫుల్-ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌ను అమర్చారు. దీనితో పాటు పగటిపూట కూడా స్టైలిష్‌గా వెలిగే ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్ (DRL) కూడా ఇచ్చారు. బైక్ పాత వింటేజ్ లుక్‌ను ఏమాత్రం దెబ్బతీయకుండా, రాత్రి వేళల్లో ప్రయాణించే రైడర్ల సేఫ్టీ కోసం ఈ సరికొత్త లైటింగ్ సిస్టమ్‌ను కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. కారు లాంటి లగ్జరీ ఫీచర్లతో ఈ బైక్ ఇప్పుడు మరింత స్పోర్టీగా కనిపిస్తోంది.
టెక్నాలజీ మరియు సేఫ్టీ విషయంలో ట్రయంఫ్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది. కొత్త టి120 బైక్‌లో ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను జోడించింది. లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి అలసట లేకుండా ఉండేందుకు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను కూడా అందించారు. ప్రయాణంలో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా యూఎస్‌బీ-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా సెట్ చేశారు. అయితే, క్లాసిక్ బైక్ ఫీల్‌ను అలాగే ఉంచేందుకు ట్విన్-పాడ్ సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అలాగే కొనసాగించారు.
ఇంజన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బోనెవిల్లే టి120 లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎందుకంటే ఇందులో ఉన్న పాత ఇంజనే ఒక పెద్ద పవర్ హౌస్. ఇందులో 1,200 సీసీ సామర్థ్యం గల లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను అమర్చారు. ఇది ఏకంగా 80 హార్స్‌పవర్ (hp), 105 Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. యాక్సిలరేటర్ కొద్దిగా తిప్పినా చాలు.. బైక్ రాకెట్‌లా దూసుకుపోతుంది.
ధరల విషయానికి వస్తే, 2026 బోనెవిల్లే టి120 ప్రారంభ ధర రూ. 12.17 లక్షలుగా ఉంది. ఇది స్టోన్ గ్రే కలర్ ఆప్షన్‌కు మాత్రమే వర్తిస్తుంది. అలా కాకుండా మరింత గ్రాండ్ లుక్ ఇచ్చే క్రాన్‌బెర్రీ రెడ్ లేదా ఏజియన్ బ్లూ వంటి డ్యూయల్-టోన్ రంగులు కావాలనుకుంటే కస్టమర్లు మరో రూ.50,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా బైక్‌ను తమకు నచ్చినట్లు డిజైన్ చేసుకునేందుకు ఎన్నో అఫీషియల్ యాక్సెసరీలను కూడా కంపెనీ విడిగా విక్రయిస్తోంది.
ట్రయంఫ్ కంపెనీ కేవలం టి120 మాత్రమే కాకుండా తన మిగతా రెండు మోడళ్లు అయిన బాబర్, స్పీడ్ మాస్టర్ లలో కూడా మేజర్ అప్‌డేట్స్ చేసింది. ఈ రెండు బైక్‌లలో మునుపటి 12-లీటర్ల చిన్న ట్యాంక్ స్థానంలో, ఇప్పుడు లాంగ్ రైడ్స్‌కు అనువుగా ఉండే 14-లీటర్ల భారీ ఫ్యూయల్ ట్యాంక్‌ను అమర్చారు. దీనివల్ల లాంగ్ జర్నీలలో పెట్రోల్ బంకుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం తప్పుతుంది. వీటితో పాటు సరికొత్త బాడీ వర్క్, తక్కువ బరువుండే అల్యూమినియం వీల్స్‌ను కూడా వీటికి జతచేశారు.
రైడర్ల కంఫర్ట్ కోసం బాబర్ మోడల్‌లో వెడల్పాటి, మెత్తటి కుషన్ ఉన్న సింగిల్ సీట్‌ను అందించారు. అలాగే స్పీడ్‌మాస్టర్ మోడల్‌లో రైడర్‌తో పాటు వెనుక కూర్చునే పిల్లియన్ సీట్‌ను కూడా ఎంతో లగ్జరీగా మార్చారు. రైడర్‌కు చేతులు నొప్పులు పుట్టకుండా ఉండేందుకు దీని హ్యాండ్ల్‌బార్‌ను కాస్త స్ట్రెయిట్‌గా పైకి లేపారు. ఈ రెండు మోడళ్లలోనూ ఇప్పుడు క్రూయిజ్ కంట్రోల్, ఐఎంయూ ఆధారిత రైడర్ ఎయిడ్స్ టెక్నాలజీని కూడా జోడించారు. వీటిలో కూడా 1200 సీసీ ఇంజనే ఉన్నప్పటికీ టి120 తో పోలిస్తే దీని ట్యూనింగ్ వేరుగా ఉంటుంది. ఈ రెండు బైక్‌ల ధరను రూ.13.52 లక్షలుగా నిర్ణయించారు. ఇది పాత ధర కంటే రూ.65,000 ఎక్కువ.