Electric Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ గత కొన్నేళ్లుగా చాలా వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్ల ధరలు పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే చాలా ఎక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుతం స్థానికంగా విడిభాగాల తయారీ, మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ, భారీ ఉత్పత్తి, బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) వంటి పథకాల వల్ల ఈ-కార్ల తయారీ వ్యయం గణనీయంగా తగ్గుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా వంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు 2027 నాటికి సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా చౌకైన ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

మారుతీ సుజుకీ స్మాల్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్:

మారుతీ సుజుకీ కంపెనీ ఒక కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మోడల్‌పై శరవేగంగా పనిచేస్తోంది. ఈ కారును ఫైనాన్షియల్ ఇయర్ 2026-27లో గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించే అవకాశం ఉంది. Vision e-Sky ఆధారంగా రూపొందుతున్న ఈ కారు దాదాపు 3.39 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది సిటీ డ్రైవింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉండే కాంపాక్ట్ సైజులో లభిస్తుంది. దీనిని కొత్త 'K-EV' ప్లాట్‌ఫామ్‌పై డిజైన్ చేస్తున్నారు. ఇందులో 29kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 270 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని అంచనా. మారుతీ మోడళ్లలోనే ఇది అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది.

హ్యుందాయ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ:

హ్యుందాయ్ మోటార్ ఇండియా మార్చి 2027 నాటికి ఒక కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఇది గ్లోబల్ మార్కెట్లో ఉన్న 'Hyundai Inster EV' ప్రేరణతో రూపుదిద్దుకుంటోంది. ఇందులో 42kWh, 49kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు లభించే అవకాశం ఉంది. పెద్ద బ్యాటరీ వెర్షన్‌ ద్వారా 350 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ లభించనుంది. ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్స్, భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్-కార్ టెక్నాలజీ, బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి హై-ఎండ్ భద్రతా ఫీచర్లు ఇందులో ఉంటాయి.

కియా న్యూ కాంపాక్ట్ ఈవీ

కియా సంస్థ కూడా భారత్‌లో తన ఎలక్ట్రిక్ ఉనికిని విస్తరించేందుకు భారీ వ్యూహాలు రచిస్తోంది. భారత్ కోసం నాలుగు కొత్త ఎలక్ట్రిఫైడ్ మోడళ్లను ప్లాన్ చేసిన కియా, అందులో ఒక 4.2 మీటర్ల పొడవుండే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురానుంది. ఈ కారును భారతదేశంలోనే అభివృద్ధి చేసి స్థానికంగానే తయారు చేయనున్నారు. లోకలైజేషన్ కారణంగా దీని ధర ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిచ్చే స్థాయిలో ఉండనుంది.

Tags: