Upcoming Cars: కొత్త కారు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తుంటే డిసెంబర్ వరకు వేచి చూడటం మంచిది. 2026 చివరి నెల ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేయబోతోంది. ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో నాలుగు అద్భుతమైన సెడాన్, ఎస్‌యూవీ కార్లు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. నెక్స్ట్ జెనరేషన్ టోయోటా ఫార్చ్యూనర్ నుంచి ఫాక్స్‌వాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ వరకు ఎన్నో మోడళ్లు ఆటో లవర్స్‌ని పలకరించబోతున్నాయి.

1. నెక్స్ట్ జెనరేషన్ టయోటా ఫార్చ్యూనర్

టయోటా కంపెనీ డిసెంబర్ 1న గ్లోబల్ మార్కెట్లో నెక్స్ట్ జెనరేషన్ ఫార్చ్యూనర్‌ను ఆవిష్కరించనుంది. ఈ కారు భారత రోడ్లపైకి వచ్చే ఏడాది అడుగుపెట్టే అవకాశం ఉంది. సరికొత్త డిజైన్‌తో రాబోతున్న ఈ కారులో పెద్ద ఫ్రంట్ గ్రిల్, స్లిమ్ హెడ్‌ల్యాంప్స్, కొత్త బంపర్లు, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్ ఆకట్టుకోనున్నాయి. ఇంటీరియర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అడాస్ వంటి భద్రతా ఫీచర్లు రానున్నాయి. ఇందులో 2.8-లీటర్ టర్బో-డీజిల్ మైల్డ్ హైబ్రిడ్, 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు లభించనున్నాయి.

2. ఫోక్స్‌వాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్

ఫోక్స్‌వాగన్ సంస్థ డిసెంబర్‌లో ప్రముఖ వర్టస్ సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సరికొత్త గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లతో కొత్త లుక్‌లో రానుంది. ఇంటీరియర్‌లో 10.25-ఇంచీల డిజిటల్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, అధునాతన అంబియంట్ లైటింగ్ రానున్నాయి. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ (115 PS పవర్), 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ (150 PS పవర్) ఇంజిన్లతో పాటు 1.0-లీటర్ మోడల్‌లో కొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

3. హోండా మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

హోండా కంపెనీ డిసెంబర్ 2న ఇండియన్ మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ మోడల్‌ను ఆవిష్కరించనుంది. 'జీరో ఆల్ఫా' కాన్సెప్ట్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ కారు డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉండబోతోంది. అధికారిక వివరాలు రానప్పటికీ ఇందులో 65 నుంచి 75 kWh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ప్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మెరుగైన రేంజ్ ఇస్తుందని అంచనా. ఈ కారు మార్కెట్లో ఉన్న మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతి సుజుకి ఇ-విటారాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

4. జేఎస్‌డబ్ల్యూ కాంబ్యాట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ

జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ డిసెంబర్ ప్రారంభంలో తన తొలి ఎస్‌యూవీని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న జెటోర్ T2 ఆధారంగా ఈ కారు రానుంది. దీనికి 'జేఎస్‌డబ్ల్యూ కాంబ్యాట్' అనే పేరు పెట్టే అవకాశం ఉంది. ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌లో రాబోతోంది. ఇందులో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 18.4 kWh బ్యాటరీ ఉండనున్నాయి. ఇవి కలిసి 360 PS పవర్, 610 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రేంజ్ పవర్‌తో ఇది ఫార్చ్యూనర్‌కు కూడా సవాలు విసరనుంది.

Tags: