ABS vs CBS : ఏబీఎస్ వర్సెస్ సీబీఎస్.. బైక్‌లలో ఏది ఉంటే ప్రమాదాలు జరగవు?

బైక్‌లలో ఏది ఉంటే ప్రమాదాలు జరగవు?

Update: 2026-07-29 17:05 GMT

ABS vs CBS : ఈ రోజుల్లో కొత్తగా బైక్ లేదా స్కూటర్ కొనేటప్పుడు చాలామంది కేవలం ఇంజిన్ మైలేజ్ మాత్రమే కాకుండా, సేఫ్టీ ఫీచర్లకు కూడా పెద్దపీట వేస్తున్నారు. టూవీలర్ విభాగంలో భద్రత అనగానే ప్రధానంగా ఏబీఎస్, సీబీఎస్ అనే రెండు టెక్నాలజీలు గుర్తుకొస్తాయి. అత్యవసర సమయాల్లో లేదా సడన్ బ్రేక్ వేసినప్పుడు వాహనం అదుపు తప్పకుండా కాపాడటంలో ఈ రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ రెండింటి పనితీరు, ప్రయోజనాల్లో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది.

ఏబీఎస్ ఎలా పనిచేస్తుంది?

ఏబీఎస్ అనేది అత్యంత ఆధునికమైన సేఫ్టీ టెక్నాలజీ. సాధారణంగా వేగంగా వెళ్లేటప్పుడు హఠాత్తుగా గట్టిగా బ్రేక్ వేస్తే చక్రాలు జామ్ అయిపోతాయి . దీనివల్ల వాహనం స్కిడ్ అయి రోడ్డుపై పడిపోయే ప్రమాదం ఉంది. కానీ ఏబీఎస్ సిస్టమ్‌లోని సెన్సార్లు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU) చక్రాల తిరిగే వేగాన్ని క్షణక్షణం గమనిస్తుంటాయి. చక్రాలు లాక్ అవ్వకుండా బ్రేక్ ప్రెజర్‌ను సెకన్లలో అనేకసార్లు తగ్గించి పెంచుతాయి. దీనివల్ల వర్షంలో లేదా తడి రోడ్డుపై కూడా వాహనంపై పూర్తి కంట్రోల్ ఉంటుంది.

సీబీఎస్ బ్రేకింగ్ బ్యాలెన్స్

సీబీఎస్ అనేది కొద్దిగా వేరైన బ్రేకింగ్ సిస్టమ్. ఇందులో ముందు, వెనుక బ్రేకులు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. రైడర్ కేవలం వెనుక బ్రేక్ లేవర్ నొక్కినా కూడా, ఈ టెక్నాలజీ బ్రేకింగ్ ఫోర్స్‌ను రెండు చక్రాలకు సమానంగా పంచుతుంది. దీనివల్ల సాధారణ ప్రయాణాల్లో సడన్ బ్రేక్ వేసినా బైక్ బ్యాలెన్స్ తప్పుకుండా ఉంటుంది. ఎక్కువగా స్కూటర్లు, తక్కువ సిసి ఉన్న సాధారణ బైక్‌లలో ఈ సీబీఎస్ విధానాన్ని ఉపయోగిస్తారు.

రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలు

ఏబీఎస్, సీబీఎస్ రెండూ భద్రతకే ఉపయోగపడినప్పటికీ, సాంకేతికంగా ఏబీఎస్ చాలా పైచేయి సాధిస్తుంది. సీబీఎస్ కేవలం బ్రేకింగ్ ఫోర్స్‌ను మాత్రమే రెండు చక్రాలకు పంచుతుంది తప్ప, చక్రాలు లాక్ అవ్వకుండా ఆపలేదు. కానీ ఏబీఎస్ ఏకంగా చక్రాలు లాక్ కాకుండా నిరోధించి, స్కిడ్ అవ్వకుండా కాపాడుతుంది. గుంతల రోడ్లు, వర్షం పడినప్పుడు, మైండ్ బ్లాక్ అయ్యే స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు ఏబీఎస్ మాత్రమే ప్రాణాలను కాపాడగలదు.

ఏది ఎక్కువ సేఫ్? నిబంధనలు ఏంటి?

సురక్షిత రైడింగ్ విషయానికి వస్తే ఏబీఎస్ సిస్టమ్ ఉన్న బైక్‌లే అత్యంత సేఫ్ అని నిపుణులు చెబుతున్నారు. అందుకే భారత ప్రభుత్వం కూడా రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కొన్ని ఖచ్చితమైన నిబంధనలు తెచ్చింది. 125 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ప్రతి రెండు చక్రాల వాహనంలో ఏబీఎస్ ఉండటాన్ని తప్పనిసరి చేసింది. 125 సీసీ కంటే తక్కువ ఉన్న బైక్‌లలో కనీసం సీబీఎస్ ఉండాలని నిబంధన విధించింది. కాబట్టి మీ బడ్జెట్ కుదిరితే ఏబీఎస్ ఫీచర్ ఉన్న వాహనాన్ని ఎంచుకోవడమే శ్రేయస్కరం.

Tags:    

Similar News