Car AC Tips : కారు ఏసీ వర్సెస్ ఓపెన్ విండోస్.. మైలేజీ పెరగాలంటే ఏది బెస్ట్? అసలు నిజం ఇదీ
మైలేజీ పెరగాలంటే ఏది బెస్ట్? అసలు నిజం ఇదీ
Car AC Tips : వేసవి కాలం వచ్చిందంటే చాలు వాహనదారులకు ఒకటే టెన్షన్. పెట్రోల్ ధరలు మండిపోతుంటే, కారులో ఏసీ వేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిపోతుంటారు. చాలామంది ఏసీ ఆన్ చేస్తే మైలేజీ తగ్గిపోతుందని, కిటికీలు దించేసి ప్రయాణిస్తుంటారు. అయితే, కిటికీలు తెరిచి ఉంచడం వల్ల నిజంగా పెట్రోల్ ఆదా అవుతుందా? లేక ఏసీ వేయడమే మంచిదా? సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అసలు లెక్క స్పీడ్‌లోనే ఉంది
కారులో పెట్రోల్ ఆదా అవ్వడం అనేది మీరు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు సిటీ ట్రాఫిక్‌లో గంటకు 40-45 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వెళ్తుంటే, ఏసీ ఆపేసి కిటికీలు తెరిచి ఉంచడం వల్ల పెట్రోల్ ఆదా అవుతుంది. తక్కువ వేగంతో వెళ్లేటప్పుడు గాలి ఒత్తిడి కారుపై పెద్దగా ప్రభావం చూపదు. కాబట్టి ఇంజిన్ మీద లోడ్ పడదు.
హైవేపై పరిస్థితి వేరు
కానీ, మీరు హైవేపై గంటకు 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు కిటికీలు తెరిస్తే కథ అడ్డం తిరుగుతుంది. నేటి కార్లన్నీ గాలిని చీల్చుకుంటూ వెళ్లేలా డిజైన్ చేస్తారు. మీరు కిటికీలు తెరిస్తే, బయటి గాలి కారు లోపలికి ప్రవేశించి పారాచూట్ లాగా కారును వెనక్కి లాగుతుంది. దీనిని డ్రాగ్ అంటారు. ఈ డ్రాగ్‌ను తట్టుకుని కారు ముందుకు వెళ్లడానికి ఇంజిన్ మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల ఏసీ వేసిన దానికంటే ఎక్కువ పెట్రోల్ ఖర్చవుతుంది. కాబట్టి హైవేపై ఏసీ ఆన్ చేసి కిటికీలు మూసేయడమే తెలివైన పని.
ఏసీ ఇంజిన్ మీద ఎంత భారం వేస్తుంది?
కారు ఏసీ నేరుగా ఇంజిన్ పవర్ ద్వారా నడుస్తుంది. ఏసీ ఆన్ చేసినప్పుడు అది సుమారు 3 నుంచి 7 హార్స్‌పవర్ శక్తిని తీసుకుంటుంది. దీనివల్ల మైలేజీ 10% నుండి 25% వరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, చిన్న కార్లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్‌లో ఉన్నప్పుడు ఏసీ వాడితే పెట్రోల్ మరింత వేగంగా ఖర్చవుతుంది.
మైలేజీ పెంచే చిన్న చిన్న చిట్కాలు
మైలేజీకి, సౌకర్యానికి మధ్య సమతుల్యత పాటించాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. కారు ఎండలో పార్క్ చేసినప్పుడు, వెంటనే ఏసీ వేయకుండా కాసేపు కిటికీలు తెరిచి లోపలి వేడి గాలిని బయటకు పంపాలి. ఆ తర్వాత ఏసీ ఆన్ చేసి రీసర్క్యులేషన్ మోడ్ వాడితే లోపలి గాలి త్వరగా చల్లబడుతుంది. ఏసీపై లోడ్ తగ్గుతుంది. అలాగే మరీ ఎక్కువ కూలింగ్ పెట్టకుండా మధ్యస్థంగా ఉంచితే ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గుతుంది.
ముగింపుగా చెప్పాలంటే.. సిటీలో నెమ్మదిగా వెళ్లేటప్పుడు కిటికీలు ఓపెన్ చేయడం మేలు. అదే వేగంగా హైవేలపై వెళ్లేటప్పుడు ఏసీ వేయడం కారుకు, మీ జేబుకు రెండింటికీ మంచిది. నిజానికి ఏసీకి, ఓపెన్ విండోస్‌కు మధ్య మైలేజీ తేడా లీటరుకు కేవలం 1 నుంచి 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీ సౌకర్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.