Ather Rizta : రెండేళ్లలోనే 3 లక్షల స్కూటర్లు.. ఫ్యామిలీ కస్టమర్ల హాట్ ఫేవరెట్ ఇదే
ఫ్యామిలీ కస్టమర్ల హాట్ ఫేవరెట్ ఇదే
Ather Rizta : భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఏథర్ ఎనర్జీ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి వచ్చిన ఏథర్ రిజ్టా మోడల్ అమ్మకాల్లో అరాచకం సృష్టిస్తోంది. లాంచ్ అయిన కేవలం రెండు ఏళ్లలోనే ఏకంగా 3 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని ఈ స్కూటర్ దాటేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏథర్ అమ్మిన మొత్తం వాహనాల్లో 76 శాతం వాటా ఒక్క రిజ్టాదే కావడం విశేషం. అంటే ఏథర్ కంపెనీని ఒక రేంజ్‌లో నిలబెట్టిన గేమ్ ఛేంజర్ మోడల్‌గా ఇది నిలిచింది.
ఏథర్ రిజ్టా ప్రయాణం గమనిస్తే.. డిసెంబర్ 2025 నాటికి ఈ స్కూటర్ 2 లక్షల యూనిట్ల మార్కును అందుకుంది. అయితే ఆ తర్వాత కేవలం ఐదు నెలల కాలంలోనే మరో లక్ష మంది కస్టమర్లు ఈ స్కూటర్ కోసం క్యూ కట్టారు. దీనివల్ల అతి తక్కువ సమయంలోనే 3 లక్షల క్లబ్‌లోకి రిజ్టా చేరిపోయింది. గతంలో ఏథర్ అంటే కేవలం దక్షిణ భారతదేశానికే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ రిజ్టా పుణ్యమా అని మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా కంపెనీ మార్కెట్ వాటా 4 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్లలో కూడా దీని క్రేజ్ మూడు రెట్లు పెరిగింది.
ఫ్యామిలీ కస్టమర్లకు ఎందుకు అంత ఇష్టం?
సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లు చూడటానికి స్టైలిష్‌గా ఉన్నా, ఫ్యామిలీతో ప్రయాణించడానికి అంత కంఫర్ట్‌గా ఉండవు. కానీ రిజ్టాను ఏథర్ ప్రత్యేకంగా ఫ్యామిలీల కోసమే డిజైన్ చేసింది. ఇందులో సీటు చాలా పెద్దగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్లోర్‌బోర్డ్ వెడల్పుగా ఉండటం వల్ల సామాన్లు పెట్టుకోవడం సులభం. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో ఏకంగా 56 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది (సీటు కింద 34 లీటర్లు, ముందు వైపు 22 లీటర్లు). మార్కెట్‌కి వెళ్లినా, ఆఫీస్‌కి వెళ్లినా కావాల్సిన సామాన్లన్నీ ఇందులో ఇట్టే సర్దేయొచ్చు.
ఫీచర్ల విషయంలో రిజ్టా ఏ మాత్రం తగ్గదు. ఇందులో 2.9 kWh, 3.7 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇక సేఫ్టీ కోసం స్కిడ్ కంట్రోల్, థీఫ్ అలర్ట్ (దొంగతనాల నుంచి రక్షణ), టో అలర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. టాప్ ఎండ్ వెర్షన్‌లో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, 17.7 సెంటీమీటర్ల టీఎఫ్ టీ డిస్‌ప్లే, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి అదుర్స్ అనిపించే ఫీచర్లు ఉండటం వల్ల కుర్రాళ్లతో పాటు ఫ్యామిలీ మేన్‌లు కూడా దీనిపై మనసు పారేసుకుంటున్నారు.