Auto Sector: భారత ఆటోమొబైల్ రంగానికి రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరం ఎంతో కీలకంగా మారనుంది. ఆగస్టు నెలలో నమోదైన అమ్మకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లు ఈ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌లుగా నిలుస్తుండటంతో మార్కెట్‌లో కొత్త ఉత్సాహం ఉప్పొంగుతోంది.

ఆగస్టులో నమోదైన అద్భుత రికార్డులు

ఐసీఐసీఐ డైరెక్ట్ తాజా నివేదిక ప్రకారం.. ఆగస్టు 2026లో భారత ఆటోమొబైల్ కంపెనీలు ఊహించని రీతిలో భారీ అమ్మకాలను నమోదు చేశాయి. దాదాపు అన్ని రకాల వాహన విభాగాల్లోనూ రెండంకెల వృద్ధి నమోదైంది. జీఎస్‌టీ 2.0 తెచ్చిన సానుకూల వాతావరణం, కొనుగోలుదారుల నుంచి కనిపిస్తున్న ఆసక్తి దీనికి ప్రధాన కారణం. వాహన్ పోర్టల్ డేటా ప్రకారం ఆగస్టు మాసంలో ఏకంగా 24 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

టూ వీలర్లలో బజాజ్, టీవీఎస్ హవా

టూవీలర్ విభాగంలో బజాజ్ ఆటో తిరుగులేని ప్రదర్శన కనబరిచింది. ఆగస్టులో ఈ సంస్థ అమ్మకాలు ఏకంగా 30 శాతం పెరిగాయి. ముఖ్యంగా విదేశాలకు ఎగుమతులు 53 శాతం మేర పుంజుకోవడం కంపెనీకి బాగా కలిసివచ్చింది. మరోవైపు టీవీఎస్ మోటార్స్ కూడా 20.5 శాతం వృద్ధితో 5.9 లక్షల యూనిట్ల విక్రయాలను సాధించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌తో పేరుగాంచిన ఐషర్ మోటార్స్ కూడా 11 శాతం వృద్ధి సాధించి 1.26 లక్షల బైకులను విక్రయించింది.

కార్ల విభాగంలో టాటా మోటార్స్ సంచలనం

ప్యాసింజర్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ అత్యంత వేగంగా దూసుకెళ్లింది. ఈ కంపెనీ కార్ల అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 56 శాతం పెరిగి 68,000 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో అత్యంత విశేషమైన విషయమేమిటంటే.. టాటా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా 94 శాతం మేర పెరిగి 16,549 యూనిట్లుగా నమోదయ్యాయి. మరో దిగ్గజం మారుతి సుజుకి 21 శాతం పెరుగుదలతో 2.16 లక్షల కార్లను విక్రయించగా, మహీంద్రా అండ్ మహీంద్రా 50 శాతం వృద్ధితో 59,000 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది.

భారీ వాహన రంగానికి కూడా ఊపిరి

కమర్షియల్ వాహనాల విభాగం కూడా కోలుకుంటున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల విక్రయాలు 49 శాతం పెరిగి 44,000 యూనిట్లకు చేరుకున్నాయి. అశోక్ లేలాండ్ 38 శాతం, విఈసీవి 18 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. భారీ ట్రక్కులు, బస్సుల వినియోగం పెరగడం దేశీయంగా మౌలిక వసతుల కల్పన పుంజుకుంటోందనడానికి సంకేతం. ట్రాక్టర్ల విభాగంలో మాత్రం వృద్ధి కాస్త నెమ్మదించినప్పటికీ, రాబోయే రోజుల్లో ఆటో రంగానికి ద్విచక్ర, ప్యాసింజర్ వాహనాలే ప్రధాన శక్తులుగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags: