Budget 2026: ఆటో రంగం ఆశల పల్లకీ..టాటా, మెర్సిడెస్ బెంజ్ కోరుతున్న మార్పులివే
టాటా, మెర్సిడెస్ బెంజ్ కోరుతున్న మార్పులివే
Budget 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం ఈసారి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటనలు వస్తాయని ఆశిస్తోంది. టాటా మోటార్స్ వంటి స్వదేశీ దిగ్గజాల నుంచి మెర్సిడెస్ బెం వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థల వరకు అన్నీ తమ కోర్కెల చిట్టాను సిద్ధం చేసుకున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఊతం ఇవ్వడంతో పాటు, లగ్జరీ కార్లపై పన్నుల భారం తగ్గించాలని ఈ కంపెనీలు గట్టిగా కోరుతున్నాయి.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖులు ప్రభుత్వానికి తమ విన్నపాలను అందించారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని నడిపిస్తున్న టాటా మోటార్స్, ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే ఎంట్రీ లెవల్ ఈవీల కోసం ప్రత్యేక ప్యాకేజీని కోరుతోంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ కార్లపై జీఎస్టీ మార్పులు, రెపో రేటు తగ్గింపు వంటి కారణాల వల్ల ప్రస్తుతం ప్రజలు పెట్రోల్ కార్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, దీనివల్ల ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు మందగించాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఈవీలకు ప్రోత్సాహకాలు ఇస్తేనే కస్టమర్లు గ్రీన్ వెహికల్స్ వైపు వస్తారని ఆయన స్పష్టం చేశారు.
కేవలం సొంత కార్లే కాకుండా, కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల (టాక్సీలు, బస్సులు) గురించి కూడా టాటా మోటార్స్ కీలక డిమాండ్ ఉంచింది. సాధారణ ప్రైవేట్ కార్లతో పోలిస్తే, కమర్షియల్ వాహనాలు ఐదు రెట్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని, తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో వీటి పాత్రే కీలకమని శైలేష్ చంద్ర గుర్తు చేశారు. గతంలో ఇవి ఫేమ్-2 పథకంలో ఉండేవని, కానీ ప్రస్తుతం ఉన్న పీఎం ఈ-డ్రైవ్ పథకంలో వీటికి చోటు దక్కలేదని ఆయన అన్నారు. కమర్షియల్ ఈవీలను మళ్ళీ ప్రోత్సాహక పథకాల్లో చేర్చడం వల్ల చమురు దిగుమతులు కూడా తగ్గుతాయని కంపెనీ ఆశిస్తోంది.
మరోవైపు లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై ఉండే కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. మెర్సిడెస్ బెంజ్ సీఈఓ సంతోష్ అయ్యర్ ప్రకారం.. ప్రస్తుతం 40 వేల డాలర్ల లోపు కార్లపై 70 శాతం, అంతకంటే ఖరీదైన కార్లపై ఏకంగా 110 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారు. దీనివల్ల లగ్జరీ కార్లు సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతున్నాయని, ఈ పన్నులను హేతుబద్ధీకరించి ఒకే స్లాబ్‌లోకి తీసుకువస్తే మార్కెట్ మరింత పుంజుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని కంపెనీ వాదిస్తోంది.
వీటితో పాటు ఆటో రంగం మొత్తం ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తోంది. పాత వాహనాలను తుక్కుగా మార్చే స్క్రాపేజ్ పాలసీని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, కొత్త వాహనాలు కొనేవారికి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మరిన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. బడ్జెట్ 2026లో గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఈ నేపథ్యంలో హైబ్రిడ్ కార్లపై కూడా జీఎస్టీ తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆటోమొబైల్ కంపెనీల డిమాండ్లను ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారో వేచి చూడాలి.