CNG Cars: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, వాహనదారులకు సీఎన్‌జీ కార్లు గొప్ప ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల్లో రోజూ రాకపోకలు సాగించేవారికి ఇవి అత్యంత పొదుపైన ఎంపికగా మారుతున్నాయి. తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా మార్కెట్లో పలు అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. లీటరుకు ఏకంగా 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే ఆ 5 బెస్ట్ సీఎన్జీ కార్ల వివరాలు తెలుసుకుందాం.

1. మారుతి సుజుకీ సెలెరియో

అత్యధిక మైలేజ్ కోరుకునే వారికి సెలెరియో సీఎన్‌జీ ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో 998సీసీ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. సీఎన్‌జీ మోడ్‌లో ఇది సుమారు 55.59 బిహెచ్‌పీ శక్తిని అలాగే 82.1 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్ లెక్కల ప్రకారం ఈ కారు లీటరుకు ఏకంగా 34.43 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దేశంలోనే అత్యధిక మైలేజ్ అందించే సీఎన్‌జీ కార్లలో ఇది అగ్రస్థానంలో నిలుస్తోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.97 లక్షలుగా ఉంది.

2. మారుతి సుజుకీ వైగన్‌ఆర్

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫ్యామిలీ కార్లలో వ్యాగన్‌ఆర్ ఒకటి. ఈ కారులో కూడా 998సీసీ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. సీఎన్‌జీ విధానంలో నడిచే ఈ మోడల్ లీటరుకు 34.05 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. సిటీ రోడ్లపై నడపడానికి అత్యంత సౌకర్యంగా ఉండే ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.88 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

3. మారుతి సుజుకీ ఆల్టో కే10

తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన సీఎన్‌జీ కారు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఆల్టో కే10 చక్కటి పరిష్కారం. ఈ జాబితాలో అత్యంత తక్కువ ధర కలిగిన కారు ఇదే కావడం విశేషం. 998సీసీ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు లీటరు సీఎన్‌జీకి 33.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 4.81 లక్షలు మాత్రమే. చిన్న కుటుంబాలకు, నగరంలో రోజువారీ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

4. మారుతి సుజుకీ డిజైర్

కాంపాక్ట్ సెడాన్ ప్రియుల కోసం డిజైర్ సీఎన్‌జీ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో అధునాతనమైన 1.2 లీటర్ జెడ్-సిరీస్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది పెట్రోల్ మోడ్‌లో 81 బిహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. ఇక సీఎన్‌జీ మోడ్‌లో ఈ కారు లీటరుకు 33.73 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. లగ్జరీ లుక్ తో పాటు అద్భుతమైన మైలేజ్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.03 లక్షలుగా ఉంది.

5. మారుతి సుజుకీ స్విఫ్ట్

యువత ఎంతో ఇష్టపడే స్పోర్టీ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కూడా సీఎన్‌జీ వేరియంట్‌లో లభిస్తుంది. డిజైర్ మోడల్‌లో ఉండే అదే పవర్ఫుల్ 1.2 లీటర్ జెడ్-సిరీస్ ఇంజిన్ ఇందులోనూ ఉంది. సీఎన్‌జీ వెర్షన్‌లో ఈ కారు లీటరుకు 32.85 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. డ్రైవింగ్ అనుభూతితో పాటు మంచి మైలేజ్ కోరుకునేవారికి ఇది ఎంతో నప్పుతుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.44 లక్షలుగా ఉంది.

Tags: