Xiaoma EV: షాకింగ్ ప్రైస్.. అదిరిపోయే రేంజ్.. రూ.3.47 లక్షలకే 1200 కిమీ వెళ్లే ఎలక్ట్రిక్ కారు

రూ.3.47 లక్షలకే 1200 కిమీ వెళ్లే ఎలక్ట్రిక్ కారు

Update: 2026-05-04 11:36 GMT

 Xiaoma EV: పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో సామాన్యుడి ఆశలన్నీ ఎలక్ట్రిక్ వాహనాల పైనే ఉన్నాయి. కానీ, మంచి రేంజ్ ఇచ్చే ఈవీలు కొనాలంటే బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. ఇలాంటి సమయంలో చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Bestune ఒక సంచలన వార్తతో ముందుకు వచ్చింది. కేవలం రూ. 3.47 లక్షల ప్రారంభ ధరతో, ఏకంగా 1200 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే షామో అనే మైక్రో ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసి ఆటోమొబైల్ రంగాన్ని షాక్‌కు గురిచేసింది. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిన్ని కారుకు ఉన్న అతిపెద్ద బలం దాని రేంజ్. సాధారణంగా ఈ చిన్న ఈవీల నుంచి 150-200 కిమీ రేంజ్ ఆశిస్తాం. కానీ షామో స్టాండర్డ్ వేరియంట్ 800 కిమీ రేంజ్ ఇస్తుండగా, రేంజ్ ఎక్స్‌టెండర్ సిస్టమ్ సాయంతో ఇది ఏకంగా 1200 కిలోమీటర్ల ప్రయాణాన్ని సాధ్యం చేస్తుంది. అంటే మీరు నగరంలో తిరిగేవారైతే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే కొన్ని వారాల వరకు ఛార్జింగ్ వైపు చూడాల్సిన అవసరం ఉండదు. ఇంత తక్కువ ధరలో ఇంతటి భారీ రేంజ్ ఇవ్వడం ప్రస్తుతానికి ఏ ఇతర కంపెనీకి సాధ్యం కాలేదు.

చైనా మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర కేవలం 30,000 యువాన్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3.47 లక్షలు. దీని టాప్ మోడల్ ధర రూ.5.78 లక్షల వరకు ఉంటుంది. ధర తక్కువ కదా అని ఫీచర్లలో కంపెనీ ఎక్కడా రాజీ పడలేదు. కారు లోపల 7-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోస్, క్వాలిటీ మ్యూజిక్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. లోపల కూర్చుంటే ఇది ఒక లగ్జరీ కారులో ఉన్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది.

బెస్ట్ ట్యూన్ షామో చూడటానికి చాలా క్యూట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. దీని పొడవు 3000 మిమీ, వెడల్పు 1510 మిమీ మాత్రమే. దీనివల్ల భారీ ట్రాఫిక్ ఉన్న రోడ్లపై, సన్నని గల్లీల్లో ఈ కారును నడపడం చాలా సులభం. పార్కింగ్ సమస్యలు అస్సలు ఉండవు. చిన్న సైజులో ఉన్నప్పటికీ, లోపల నలుగురు ప్రయాణించేలా స్థలాన్ని చాలా తెలివిగా కేటాయించారు. సేఫ్టీ కోసం డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్ (ABS) వంటి ఫీచర్లను కూడా చేర్చారు.

ఈ మైక్రో ఈవీలో 20 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది కారు వెనుక చక్రాలకు పవర్‌ను అందిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో అత్యంత సురక్షితమైన LFP (లిథియం-ఐరన్ ఫాస్ఫేట్) టెక్నాలజీని వాడారు. ప్రస్తుతం భారత్‌లో టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ వంటి చిన్న ఈవీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో బెస్ట్ ట్యూన్ కంపెనీ ఈ కారును ఇండియాలో లాంచ్ చేస్తే మార్కెట్ షేక్ అవ్వడం ఖాయం. అయితే భారత లాంచ్‌పై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Tags:    

Similar News