Car Buying Tips: దేశవ్యాప్తంగా కొత్త కార్లు అలాగే ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాలలో చాలామంది తమ కలల వాహనాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే వాహనం కొనే సమయంలో కేవలం మోడల్, ధర లేదా లభించే డిస్కౌంట్లు మాత్రమే చూసి మోసపోకూడదు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసే ఆ షోరూమ్ సంబంధిత ఆటోమొబైల్ కంపెనీకి చెందిన అధీకృత డీలర్ కాదా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. మోసపూరిత వ్యక్తులు లేదా అనధికారిక డీలర్ల చేతిలో చిక్కుకుంటే భవిష్యత్తులో వారంటీ, సర్వీసింగ్ సేవలు పొందడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకావాల్సి వస్తుంది.

కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో డీలర్ లొకేటర్ చెక్ చేయడం

డీలర్ నిజమైనవాడో కాదో తెలుసుకోవడానికి ఎలాంటి కష్టమైన ప్రక్రియ అవసరం లేదు. మీరు ఏ కంపెనీకి చెందిన వాహనం కొనాలనుకుంటున్నారో, ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీల వెబ్‌సైట్లలో ఫైండ్ ఎ డీలర్ లేదా డీలర్ లొకేటర్ అనే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ రాష్ట్రం అలాగే నగరాన్ని ఎంచుకుంటే ఆ ప్రాంతంలోని అసలైన అధీకృత డీలర్ల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ జాబితాలో మీరు వెళ్తున్న షోరూమ్ పేరు లేకపోతే డబ్బులు చెల్లించే విషయంలో అప్రమత్తం కావడం మంచిది.

షోరూమ్‌లో సర్టిఫికేట్ పరిశీలన

మీరు నేరుగా షోరూమ్‌కు వెళ్లి వాహనం బుక్ చేసుకుంటున్నట్లయితే, అక్కడ మేనేజర్‌ను కంపెనీ జారీ చేసిన అధీకృత డీలర్ సర్టిఫికేట్ చూపించమని కోరవచ్చు. సాధారణంగా ఎలాంటి మోసాలకు తావులేని రిజిస్టర్డ్ డీలర్లు ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందరికీ కనిపించేలా రిసెప్షన్ లేదా ప్రధాన కార్యాలయంలో ప్రదర్శిస్తారు. ఒకవేళ షోరూమ్ సిబ్బంది దీనిని చూపించడానికి వెనుకడుగు వేస్తే ఎలాంటి ముందస్తు చెల్లింపులు చేయకూడద. ఏమాత్రం అనుమానం ఉన్నా కంపెనీ అధికారిక కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసి షోరూమ్ వివరాలు చెప్పి సరిచూసుకోవడం ఉత్తమం.

బుకింగ్ సమయంలో రసీదులు సరిగ్గా తనిఖీ చేయాలి

వాహనం బుక్ చేసే సమయంలో టోకెన్ అమౌంట్ లేదా మరేదైనా ముందస్తు చెల్లింపులు చేసేటప్పుడు రసీదును క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ రసీదుపై డీలర్ సరైన చట్టపరమైన పేరు, జీఎస్టీ నంబర్ అలాగే చెల్లింపునకు సంబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా ముద్రించబడి ఉండాలి. సాధారణ తెల్ల కాగితాలపై రాసిచ్చే రసీదులు లేదా సరైన బిల్లు లేకుండా నగదు బదిలీ చేయడం వంటి పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. కొద్దిపాటి అప్రమత్తత పాటించడం ద్వారా భవిష్యత్తులో జరగnబోయే పెద్ద ఆర్థిక నష్టాల నుంచి సులభంగా రక్షించుకోవచ్చు.

Tags: