BMW: 669 కిమీ రేంజ్, కళ్లు చెదిరే లుక్స్.. భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ నయా ఎలక్ట్రిక్ సెడాన్
బీఎండబ్ల్యూ నయా ఎలక్ట్రిక్ సెడాన్
BMW: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లోకి సరికొత్త ఐ5 లాంగ్ వీల్‌బేస్(LWB) ఎలక్ట్రిక్ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.79.60 లక్షల ఆకర్షణీయమైన ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన ఈ మోడల్, దేశంలోనే లోకల్‌గా అసెంబుల్ చేసిన కంపెనీ తొలి మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ సెడాన్‌గా రికార్డు సృష్టించింది. బీఎండబ్ల్యూ ఐ5 ఈడ్రైవ్35ఎల్ ఎమ్ స్పోర్ట్ వేరియంట్ ధరను రూ.79.60 లక్షలుగా నిర్ణయించారు. దీని చెన్నై ప్లాంట్‌లో అసెంబ్లింగ్ పనులు ప్రారంభించగా, డెలివరీలు సైతం మొదలయ్యాయి. ప్రత్యేకంగా తీసుకొచ్చిన 'ఫస్ట్ ఎడిషన్' పరిమిత వెర్షన్ కూడా ఇదే ధరకు లభించగా, కేవలం 99 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. లాంచ్‌కు ముందే ఈ 99 కార్లూ పూర్తిగా అమ్ముడుపోవడం విశేషం. పొడవైన చక్రాల నిడివి వల్ల వెనుక సీటు ప్రయాణికులకు అత్యున్నత సౌకర్యం లభిస్తుంది.
సింగిల్ ఛార్జ్‌తో 669 కిలోమీటర్ల ప్రయాణం
ఈ కారులో భారీ 81.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 268 హెచ్‌పీ పవర్, 410 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 6.7 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం దీని సొంతం. గరిష్ఠంగా గంటకు 195 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఎంఐడిసి సైకిల్ ప్రకారం ఏకంగా 669 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. 160 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 33 నిమిషాల్లోనే బ్యాటరీ 10 నుంచి 80 శాతానికి రీఛార్జ్ అవుతుంది. ఉచితంగా వాల్‌బాక్స్ ఛార్జర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
లగ్జరీ కేబిన్.. అత్యాధునిక హంగులు
కారు లోపల ఐకానిక్ బీఎండబ్ల్యూ కర్వ్‌డ్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఇందులో 12.3 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచుల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇచ్చారు. క్లాసీ క్రిస్టల్ ఫినిషింగ్, 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటివి సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ప్రయాణికుల కోసం 'బౌవర్స్ అండ్ విల్కిన్స్' సరౌండ్ సౌండ్ సిస్టమ్ అమర్చారు. ఫస్ట్ ఎడిషన్ మోడల్‌లో వెనుక ప్రయాణికుల కోసం ప్రత్యేక టాబ్లెట్ వినోద వ్యవస్థను ఏర్పాటు చేశారు.
భారత రోడ్లకు అనుగుణంగా ఎయిర్ సస్పెన్షన్
భారతీయ రహదారుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ కారులో అడాప్టివ్ రియర్-యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్‌ను అమర్చారు. గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా పెంచడం వల్ల గుంతల రోడ్లపై సైతం ప్రయాణం సుఖవంతంగా సాగుతుంది. సేఫ్టీ కోసం 8 ఎయిర్‌బ్యాగ్‌లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్టెంట్ ప్రోఫెషనల్, లేన్ చేంజ్ వార్నింగ్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వారంటీని సంస్థ ఆఫర్ చేస్తోంది.