BMW: బీఎండబ్ల్యూ సంచలనం.. 728 కిలోమీటర్ల రేంజ్‌తో ఐ7 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్
ఐ7 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ లాంచ్
BMW: జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్‌లో తన ఐ7 ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. సరికొత్త టెక్నాలజీ, భారీ బ్యాటరీ సామర్థ్యంతో రూపుదిద్దుకున్న ఈ మోడల్ ప్రారంభ ధరను పాత వేరియంట్ కంటే ఏకంగా రూ.15 లక్షలు తగ్గించడం వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొత్త బీఎండబ్ల్యూ ఐ7 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ప్రధాన మార్పు దాని బ్యాటరీ విభాగంలోనే జరిగింది. పాత మోడల్‌లో ఉన్న 101.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ స్థానంలో 112.5 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల సరికొత్త బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనివల్ల ఈడ్రైవ్50 మోడల్ ఒకసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే 728 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని డబ్ల్యూఎల్టిపి ధ్రువీకరించింది. ఇది పాత వెర్షన్ కంటే 125 కిలోమీటర్లు అదనం కావడం విశేషం. మరోవైపు అత్యంత శక్తివంతమైన ఎం70 ఎక్స్‌డ్రైవ్ వేరియంట్ 686 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం
ఛార్జింగ్ సమయాన్ని ఆదా చేసేందుకు ఈ కారులో 250 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. దీని సహాయంతో కేవలం 28 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. అత్యవసర సమయాల్లో కేవలం 10 నిమిషాల పాటు ఫాస్ట్ ఛార్జ్ చేస్తే 235 కిలోమీటర్ల దూరం ప్రయాణించే రేంజ్ లభిస్తుంది. సాధారణ 22 కిలోవాట్ల ఎసి ఛార్జర్‌తో ఇంటి వద్ద ఛార్జ్ చేయడానికి దాదాపు 6 గంటల సమయం పడుతుంది.
ధరలు, వేగం విభాగంలో అప్‌డేట్లు
ఈడ్రైవ్50 మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.95 కోట్లుగా నిర్ణయించారు. స్థానికంగా చెన్నై ప్లాంట్‌లో అసెంబుల్ చేయడం వల్ల పాత మోడల్ ధర రూ. 2.10 కోట్ల కంటే రూ.15 లక్షలు తగ్గింది. సీబీయూ రూపంలో దిగుమతి అయ్యే ఎం70 ఎక్స్‌డ్రైవ్ ధర రూ.2.65 కోట్లుగా ఉంది. ఈడ్రైవ్50 మోడల్ 455 బిహెచ్‌పి పవర్‌తో 5.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఎం70 వేరియంట్ స్పోర్ట్ బూస్ట్ మోడ్‌లో 680 హార్స్‌పవర్, 1,100 న్యూటన్ మీటర్ల టార్క్‌తో కేవలం 3.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని తాకుతుంది.
ఇంటీరియర్ లగ్జరీ, థియేటర్ స్క్రీన్ అనుభూతి
కారు లోపలి భాగంలో విండ్‌స్క్రీన్ కింద బీఎండబ్ల్యూ పానరోమిక్ విజన్ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డాష్‌బోర్డ్‌పై 17.9 అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్, ప్యాసింజర్ కోసం 14.6 అంగుళాల డిస్‌ప్లే అమర్చారు. వెనుక సీట్లలో కూర్చునే వారి కోసం 31.3 అంగుళాల థియేటర్ స్క్రీన్, డాల్బీ అట్మాస్‌తో కూడిన బోవర్స్ అండ్ విల్కిన్స్ ఆడియో సిస్టమ్ ఇచ్చారు. మసాజ్ సీట్లు, పానరోమిక్ గ్లాస్ రూఫ్‌లో 40కి పైగా ఎల్‌ఈడీ లైట్లు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఈ లగ్జరీ ఈవీలో సొంతం.