BMW : లగ్జరీ కార్ల ప్రియులకు షాక్.. జూలై 1 నుంచి పెరగనున్న బీఎండబ్ల్యూ, మినీ కార్ల ధరలు
జూలై 1 నుంచి పెరగనున్న బీఎండబ్ల్యూ, మినీ కార్ల ధరలు
BMW : లగ్జరీ కార్ల ప్రియులకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది. వచ్చే నెల, అంటే జూలై 1, 2026 నుంచి తమ కంపెనీకి చెందిన అన్ని బీఎండబ్ల్యూ, మినీ కార్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ధరల పెంపు 2 శాతం వరకు ఉండబోతోందని, కంపెనీ విక్రయించే అన్ని రకాల మోడళ్లకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. లగ్జరీ కార్ల కొనుగోలు ప్లాన్ చేసుకుంటున్న వారికి ఈ నిర్ణయం కాస్త భారంగా మారనుంది.
ధరల పెంపునకు అసలు కారణాలివే
ఈ నిర్ణయంపై బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ మాట్లాడుతూ.. భారత మార్కెట్లో తమ కార్లకు డిమాండ్ చాలా బలంగా ఉందని చెప్పారు. కస్టమర్లకు అత్యున్నత నాణ్యత, ప్రీమియం సేవలను అందించడానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ క్షీణించడం, రవాణా ఖర్చులు భారీగా పెరగడం వల్లే ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఈ పెంపు వల్ల వచ్చే ఆదాయం కస్టమర్లకు ప్రపంచ స్థాయి సేవలను నిరంతరాయంగా కొనసాగించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.
ఏయే మోడళ్లపై ప్రభావం పడనుంది?
ప్రస్తుతం బీఎండబ్ల్యూ సంస్థ భారతదేశంలోనే పలు రకాల పాపులర్ కార్లను లోకల్‌గా తయారు చేస్తోంది. వాటిలో బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్, 7 సిరీస్, అలాగే ఎస్‌యూవీ మోడళ్లయిన ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7తో పాటు ఐఎక్స్1 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వీటితో పాటు విదేశాల నుండి నేరుగా ఇంపోర్ట్ చేసుకునే ఐ5 ఎమ్60, ఐ7, ఐఎక్స్ ఎలక్ట్రిక్ కార్లు, ఎమ్2 కూపే, ఎమ్5, ఎక్స్ఎమ్ వంటి సూపర్ లగ్జరీ కార్లపై కూడా ఈ 2 శాతం ధరల భారం పడనుంది.
బీఎండబ్ల్యూ సమ్మర్ సర్వీస్ క్యాంపెయిన్ 2026
ధరల పెంపు ప్రకటనకు ముందే, బీఎండబ్ల్యూ తన పాత మరియు కొత్త కస్టమర్ల కోసం ఒక ప్రత్యేకమై సమ్మర్ సర్వీస్ క్యాంపెయిన్ 2026ను ప్రారంభించింది. వేసవి కాలంలో కార్లు ఎలాంటి బ్రేక్‌డౌన్స్ లేకుండా పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉండేలా చూడటమే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌లలో ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా కారులోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, టైర్లు, బ్యాటరీల ఆరోగ్యాన్ని నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏసీ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, టైర్ల కండిషన్‌ను ఉచితంగానే చెక్ చేసి ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కార్ల బ్యాటరీల హెల్త్ చెకప్ కూడా ఉచితంగానే లభిస్తోంది.
సర్వీసింగ్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు
ఈ సమ్మర్ క్యాంపెయిన్‌లో భాగంగా కస్టమర్లకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఏసీ సిస్టమ్‌ను క్లీన్ చేసి దుర్వాసనను పోగొట్టే ఏసీ ఫ్యూమిగేషన్ సర్వీస్‌పై 10% వరకు తగ్గింపు ఇస్తున్నారు. ఒకవేళ మీ కారు ఏసీకి ఏదైనా రిపేర్ అవసరమైతే, దానికి అయ్యే లేబర్ ఛార్జీలపై ఏకంగా 25% వరకు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇతర వాల్యూ యాడెడ్ సర్వీసెస్ (VAS) పై కూడా 10% వరకు తగ్గింపు ఉంది. కాబట్టి, మీరు కనుక కొత్త బీఎండబ్ల్యూ లేదా మినీ కారు కొనాలనే ఆలోచనలో ఉంటే.. జూలై 1 కంటే ముందే కొనుగోలు చేయడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఇప్పటికే కారు ఉన్నవారు ఈ సమ్మర్ సర్వీస్ క్యాంపెయిన్‌ను వాడుకొని తమ లగ్జరీ కారును సేఫ్‌గా ఉంచుకోవచ్చు.