BMW : ఇండియా మార్కెట్లోకి బీఎండబ్ల్యూ కొత్త కింగ్.. రూ.1.77 కోట్లతో లగ్జరీ ఎస్‌యూవీ లాంచ్
రూ.1.77 కోట్లతో లగ్జరీ ఎస్‌యూవీ లాంచ్
BMW : లగ్జరీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా మార్కెట్లో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ X6 M60i xDrive ఎస్‌యూవీ కారును అధికారికంగా విడుదల చేసింది. ఇదొక హై-పర్ఫార్మెన్స్ స్పోర్టీ ఎస్‌యూవీ కూపే కారు. విదేశీ ప్లాంట్ లో పూర్తిగా తయారైన సీబీయూ రూపంలో ఈ కారును మన దేశానికి తీసుకువచ్చారు. రోడ్లపై తిరుగుతున్నప్పుడు అందరి దృష్టిని ఆకర్షించేలా దీని డిజైన్ ను చాలా బోల్డ్ అండ్ ప్రీమియం లుక్ తో తయారు చేశారు. ప్రత్యేకమైన M-Tuning అప్‌గ్రేడ్స్ వల్ల ఈ కారు డ్రైవింగ్ చేసేటప్పుడు రేసింగ్ ట్రాక్ పై వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుందని కంపెనీ పేర్కొంది.
సరికొత్త బీఎండబ్ల్యూ X6 M60i కారు క్లాసిక్ కూపే రూఫ్‌లైన్ తో అద్భుతంగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, విలక్షణమైన 'M' బ్యాజింగ్ గల బ్లాక్ కిడ్నీ గ్రిల్, గ్లోస్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కారుకు స్పోర్టీ లుక్ ఇవ్వడానికి ఇందులో భారీ 21 ఇంచుల అల్లాయ్ వీల్స్ అమర్చారు. అంతేకాకుండా, రెడ్ కాలిపర్స్ గల ఎమ్ స్పోర్ట్ బ్రేకులు, క్వాడ్ ఎగ్జాస్ట్ (నాలుగు సైలెన్సర్లు), రియర్ స్పాయిలర్ కలిగిన M Sport Package Proను ఇందులో స్టాండర్డ్ గా అందించారు. ఈ లగ్జరీ మోడల్ 6 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
కారు లోపలి భాగం ఒక విలాసవంతమైన ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. ఇందులో బీఎండబ్ల్యూ సిగ్నేచర్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉంది. ఒకే సింగిల్ గ్లాస్ ప్యానల్ కింద 12.3 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచుల టచ్‌స్క్రీన్ కంట్రోల్ డిస్‌ప్లేను అమర్చారు. డ్యాష్‌బోర్డ్‌పై ప్రీమియం సెన్స్‌ఫిన్ అప్హోల్స్టరీ, మెటల్-ఎఫెక్ట్ వుడ్ ట్రిమ్స్ , ప్రత్యేకమైన ఎంబియంట్ లైటింగ్ బార్ ఉన్నాయి. సంగీత ప్రియుల కోసం 464-వాట్ యాంప్లిఫైయర్ కలిగిన 16 స్పీకర్ల హార్మన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్‌ను ఇందులో జోడించారు. వెంటిలేటెడ్ కంఫర్ట్ సీట్లను డ్రైవర్ తన అవసరానికి తగ్గట్లు ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఈ లగ్జరీ కారులో అసలైన పవర్ హౌస్ దాని ఇంజిన్. ఇందులో 4.4 లీటర్ల భారీ వీ8 (V8) పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు, ఇది లేటెస్ట్ 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ ఏకంగా 530 హార్స్‌పవర్ (hp) శక్తిని, 750 న్యూటన్ మీటర్ల (Nm) గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఆల్-వీల్ డ్రైవ్ (xDrive) సిస్టమ్ వల్ల ఈ భారీ ఎస్‌యూవీ కేవలం 4.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లుగా నిర్ణయించారు.
కోట్లు విలువ చేసే ఈ కారులో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో బీఎండబ్ల్యూ ఎఫిషియంట్ డైనమిక్స్ కింద ఆటో స్టార్ట్-స్టాప్, బ్రేక్-ఎనర్జీ రీజెనరేషన్, ఎకో ప్రో మోడ్స్ ఉన్నాయి. ప్రయాణీకుల రక్షణ కోసం కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబీఎస్ (ABS), డీటీసీ, డీఎస్‌సీ కంట్రోల్స్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, టైర్ ప్రెజర్ మానిటర్ (TPMS), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, అత్యవసర క్ర్యాష్ సెన్సార్లను అమర్చారు. రోడ్డుపై గ్రిప్ కోసం ఇందులో అడాప్టివ్ ఎమ్ సస్పెన్షన్ సిస్టమ్ కూడా ఉంది.