Kwid Vs Alto K10 : రూ.5 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్? రెనాల్ట్ క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో K10 మైలేజ్ వార్

రెనాల్ట్ క్విడ్ వర్సెస్ మారుతి ఆల్టో K10 మైలేజ్ వార్

Update: 2026-07-07 06:01 GMT

Kwid Vs Alto K10 : మధ్యతరగతి కుటుంబాలు రూ.5 లక్షల లోపు బడ్జెట్‌లో ఒక సొంత కారు కొనాలనుకుంటే మొదటగా గుర్తుకువచ్చే పేర్లు రెనాల్ట్ క్విడ్, మారుతి సుజుకి ఆల్టో K10. ఈ విభాగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రసిద్ధ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు క్విడ్‎ను సరికొత్త అప్‌డేట్స్, కొత్త వేరియంట్లు, ఆకర్షణీయమైన ధరలతో మార్కెట్లో లాంచ్ చేసింది. కార్ల డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, సరికొత్త బ్రాండింగ్, మెరుగైన ఫీచర్లతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ కారుకు, భారతీయ మార్కెట్లో దశాబ్దాలుగా మొదటిసారి కారు కొనేవారికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మారుతి ఆల్టో K10కు మధ్య ఇప్పుడు పోటీ తీవ్రతరమైంది.

డిజైన్, లుక్

కారు డిజైన్ విషయానికి వస్తే రెనాల్ట్ క్విడ్ చాలా స్టైలిష్‌గా, ఒక చిన్న ఎస్‌యూవీ కారులా కనిపిస్తుంది. ఇందులో ఇచ్చిన స్ప్లిట్ ఎల్‌ఈడీ లైట్లు, కారు చుట్టూ ఉండే క్లాడింగ్, రోడ్లపై గుంతలను సులభంగా దాటగలిగేలా ఉన్న 184mm గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి మంచి రోడ్ ప్రెజెన్స్‌ను ఇస్తాయి. ముఖ్యంగా దీని క్లైంబర్ వేరియంట్‌లోని ఆరెంజ్ కలర్ హైలైట్స్, డ్యూయల్ టోన్ డిజైన్ యువతను బాగా ఆకట్టుకుంటాయి. మరోవైపు, మారుతి ఆల్టో K10 డిజైన్ చాలా సాధారణంగా, క్లాసిక్‌గా ఉంటుంది. అయితే, పాత మోడల్‌తో పోలిస్తే కొత్త జనరేషన్ ఆల్టో K10 పరిమాణం పెద్దదిగా మారి చూడటానికి మునుపటికంటే చాలా బాగుంది.

ఇంటీరియర్, ఫీచర్స్

ఫీచర్ల పరంగా చూస్తే రెనాల్ట్ క్విడ్ కాస్త అడ్వాన్స్‌డ్‌గా నిలుస్తుంది. ఈ కారులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 8 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, కీ-లెస్ ఎంట్రీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా ఆల్టో K10లో 7 ఇంచుల టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నప్పటికీ ఇందులో రివర్స్ కెమెరా వంటి సదుపాయం లేదు. అయితే, లోపల కూర్చునే ప్రయాణికులకు కేబిన్ స్పేస్, వెనుక సీట్లలో ప్రయాణ సౌకర్యం విషయంలో మాత్రం ఆల్టో K10 చాలా మెరుగ్గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది.

ఇంజన్ పర్ఫార్మెన్స్, మైలేజ్

రెండు కార్లలోనూ సమానంగా 1.0 లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ రెండింటిలోనూ 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. కానీ పర్ఫార్మెన్స్ పరంగా మారుతి K-సిరీస్ ఇంజన్ చాలా స్మూత్‌గా, నిశ్శబ్దంగా ఉంటూ వేగవంతమైన రెస్పాన్స్ ఇస్తుంది. ఇది 66.6 bhp పవర్, 89 Nm టాక్‌ను జనరేట్ చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో రోజువారీ ప్రయాణాలకు ఆల్టో ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే క్విడ్ లీటరుకు 21.46 కిమీ నుంచి 22.3 కిమీ మైలేజ్ ఇస్తుంది. కాగా ఆల్టో K10 పెట్రోల్ మాన్యువల్‌లో 24.39 కిమీ, ఆటోమేటిక్‌లో 24.9 కిమీ మరియు కంపెనీ ఫిట్టెడ్ సిఎన్‌జి (CNG) వేరియంట్‌లో ఏకంగా 33.85 కిమీ/కేజీ మైలేజ్ ఇస్తూ కస్టమర్ల ఇంధన ఖర్చులను భారీగా తగ్గిస్తుంది.

సేఫ్టీ, బూట్ స్పేస్

సేఫ్టీ విషయంలో మారుతి సుజుకి ఈసారి చాలా పెద్ద అడుగు వేసింది. ఆల్టో K10 కారులోని అన్ని వేరియంట్లలో (బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు) 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (ABS) ఫీచర్‌ను స్టాండర్డ్‌గా అందిస్తోంది. కానీ రెనాల్ట్ క్విడ్ బేస్ వేరియంట్‌లో కేవలం 2 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే వస్తాయి, 6 ఎయిర్‌బ్యాగ్‌ల ఫీచర్ కేవలం టాప్ ఎండ్ క్లైంబర్ వేరియంట్లోనే లభిస్తుంది. అయినప్పటికీ, క్విడ్ కారులో 17 రకాల ప్రాథమిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. లగేజీ పెట్టుకునే బూట్ స్పేస్ పరంగా క్విడ్ 279 లీటర్ల పెద్ద స్పేస్‌తో ముందంజలో ఉండగా, ఆల్టో K10 కేవలం 214 లీటర్ల బూట్ స్పేస్‌ను మాత్రమే కలిగి ఉంది.

సామాన్యుడి బడ్జెట్‌కు ఏది కరెక్ట్?

ధరల పరంగా చూస్తే మారుతి ఆల్టో K10 చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ఆల్టో K10 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.70 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ రూ. 5.45 లక్షల వరకు ఉంటుంది. అదే సమయంలో, సరికొత్త అప్‌డేట్స్‌తో వచ్చిన రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.52 లక్షలుగా ఉంది. దీని టాప్ ఎండ్ క్లైంబర్ మోడల్‌ను ఆన్‌లైన్ ఆఫర్ల సహాయంతో రూ. 4.99 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. స్టైలిష్ లుక్, ఎక్కువ ఫీచర్లు, పెద్ద బూట్ స్పేస్ కావాలనుకునే వారికి క్విడ్.. అలాగే నమ్మకమైన ఇంజన్, ఎక్కువ మైలేజ్, అన్ని వేరియంట్లలో పూర్తి సేఫ్టీ (6 ఎయిర్‌బ్యాగ్స్) కోరుకునే వారికి ‘ఆల్టో K10’ సరైన ఎంపిక.

Tags:    

Similar News