BYD Denza Z9 GT: 2.7 సెకండ్లలోనే 100 కిమీ స్పీడు.. భారత్‌లోకి రానున్న సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారు
సరికొత్త లగ్జరీ ఎలక్ట్రిక్ కారు
BYD Denza Z9 GT: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీవైడీ తన అత్యంత లగ్జరీ ప్రీమియం బ్రాండ్ డెన్జాను భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ బ్రాండ్ కింద విడుదల కానున్న తొలి అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు డెన్జా జెడ్9 జీటీ గురించిన వివరాలు ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.
డెన్జా జెడ్9 జీటీ కారు ప్రధాన ఆకర్షణ దాని పర్ఫామెన్స్. ఈ కారులో పవర్ఫుల్ ట్రై-మోటార్ సెటప్‌ను అమర్చారు. ముందు భాగంలో ఒక ఎలక్ట్రిక్ మోటార్, వెనుక చక్రాల కోసం మరో రెండు మోటార్లు ఈ కారుకు అద్భుతమైన శక్తిని అందిస్తాయి. ఈ మూడు మోటార్లు కలిసి సుమారు 850 కిలోవాట్లు అనగా దాదాపు 1,140 బీహెచ్‌పీ శక్తిని అలాగే 1,210 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. దాదాపు 2.9 టన్నుల బరువున్న ఈ కారు కేవలం 2.7 సెకండ్లలోనే సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగడం విశేషం. దీని టాప్ స్పీడు గంటకు 270 కిలోమీటర్లుగా ఉంది.
ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారులో 122.5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన రెండవ తరఫు బ్లేడ్ బ్యాటరీని పొందుపరిచారు. బీవైడీ సంస్థ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సెల్-టు-బాడీ టెక్నాలజీ ద్వారా బ్యాటరీని నేరుగా కారు నిర్మాణంలో భాగంగా చేర్చారు. డబ్ల్యూఎల్‌టీపీ అంచనాల ప్రకారం ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అంతేకాకుండా ఇందులో ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. తగిన ఛార్జింగ్ స్టేషన్‌లో కేవలం 5 నిమిషాల్లోనే 10 నుంచి 70 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అయ్యే అత్యాధునిక సదుపాయం ఇందులో లభిస్తుంది.
డెన్జా జెడ్9 జీటీ పరిమాణంలోనూ చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ కారు పొడవు 5,180 ఎంఎం, వెడల్పు 1,990 ఎంఎం అలాగే వీల్‌బేస్ 3,125 ఎంఎంగా ఉంది. పెద్ద సైజులో ఉన్నప్పటికీ దీన్ని సులభంగా టర్న్ చేయడానికి రియర్-వీల్ స్టీరింగ్ అలాగే ఎయిర్ సస్పెన్షన్‌ను అందించారు. కారు లోపలి భాగంలో ప్రయాణికుల విలాసం కోసం ఏకంగా ఐదు స్క్రీన్‌లను అమర్చారు. కెమెరా ఆధారిత మిర్రర్స్, సీట్ మసాజ్, హీటింగ్ అలాగే వెంటిలేషన్ వంటి అత్యాధునిక లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
2026 సంవత్సరం చివరి నాటికి ఈ కారు భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని పూర్తిగా తయారైన కారు రూపంలో దిగుమతి చేసుకుని విక్రయించే అవకాశం ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ-ఎన్‌సీఆర్ అలాగే ముంబైలలో ప్రత్యేకంగా డెన్జా అవుట్‌లెట్‌లను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. మార్కెట్లో ఈ కారు అంచనా ధర సుమారు రూ. 1.2 కోట్ల నుంచి రూ. 1.5 కోట్ల మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.