BYD : ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 1,000 కిలోమీటర్ల జర్నీ.. బీవైడీ నుంచి అదిరిపోయే కారు

బీవైడీ నుంచి అదిరిపోయే కారు

Update: 2026-05-28 12:33 GMT

BYD : ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన చైనాకు చెందిన బీవైడీ, గ్లోబల్ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమైంది. పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా, ఇప్పుడు హైబ్రిడ్ సెగ్మెంట్‌లోనూ తన జెండా పాతేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. ఐరోపా మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ కంపెనీ తమ సరికొత్త కాంపాక్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ కార్ బీవైడీ డాల్ఫిన్ G DM-iను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసింది.

చాలా చైనీస్ బ్రాండ్లు తమ దేశంలో విక్రయించే కార్లనే కొద్దిపాటి మార్పులతో వేరే దేశాల్లో లాంచ్ చేస్తుంటాయి. కానీ, బీవైడీ ఈ డాల్ఫిన్ G కారును మొదటి నుంచీ యూరప్ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగానే ప్రత్యేకంగా డిజైన్ చేసింది. కారు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎలాంటి రేంజ్ ఆందోళన లేకుండా, ప్యూర్ ఈవీ కార్ డ్రైవింగ్ అనుభూతిని పొందాలనుకునే వారి కోసం ఈ కారును తీసుకొచ్చారు.

ఐరోపా మార్కెట్లో ఈ కారు డెలివరీలు 2026 చివరి నాటికి ప్రారంభం కానున్నాయి. దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా జాజ్ హైబ్రిడ్ (దీని ధర యూకేలో దాదాపు రూ.36.65 లక్షలు) కంటే చాలా తక్కువ ధరకే ఇది లభించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక భారతీయుల విషయానికి వస్తే.. ఈ అంతర్జాతీయ ప్రకటనకు కొన్ని రోజుల ముందే బీవైడీ ఇండియా తమ సోషల్ మీడియా ఖాతాలలో సరికొత్త DM-i హైబ్రిడ్ టెక్నాలజీకి సంబంధించిన అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తే, బీవైడీ కంపెనీ త్వరలోనే భారతదేశంలో కూడా తమ పవర్‌ఫుల్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలను లాంచ్ చేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

యూరప్ బీ-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో అడుగుపెడుతున్న ఈ డాల్ఫిన్ G DM-i కారు పొడవు 4,160 mm గా ఉంది. ఇది మార్కెట్లో ఉన్న ప్రసిద్ధ ఫోక్స్‌వ్యాగన్ పోలో, రెనో క్లియో, టయోటా యారిస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే, పోటీ కంపెనీలు కేవలం మైల్డ్-హైబ్రిడ్ లేదా స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను మాత్రమే వాడుతుంటే.. బీవైడీ మాత్రం ఇందులో ఏకంగా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) సిస్టమ్‌ను అమర్చింది.

ఈ టెక్నాలజీ సహాయంతో ఈ కారు ఏకంగా 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ సుదీర్ఘ డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుందని బీవైడీ గర్వంగా ప్రకటించింది. యూరప్‌లో విక్రయించబడే అనేక పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ కంటే ఇది చాలా ఎక్కువ కావడం విశేషం. ఈ కారులోని DM-i సిస్టమ్ పూర్తిగా ఎలక్ట్రిక్ డ్రైవింగ్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ నేరుగా కారును నడపడానికి కాకుండా, కారులోని బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి ఒక జనరేటర్ లాగా మాత్రమే పనిచేస్తుంది. లాంగ్ జర్నీలలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు ఈ ఇంజన్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అయితే కారు అత్యధిక స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు మాత్రం, మెరుగైన ఎఫిషియెన్సీ కోసం ఇంజన్ నేరుగా చక్రాలకు పవర్‌ను అందిస్తుంది.

ఈ కారులో బీవైడీకి చెందిన అత్యంత సురక్షితమైన, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బీవైడీ బ్లేడ్ బ్యాటరీ, 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించనున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఉన్న అట్టో 2 కారులో కూడా ఇదే సెటప్ ఉంది. ఇది 164 PS నుంచి 212 PS వరకు పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 7.8 kWh, 18 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది. కేవలం ప్యూర్ ఈవీ మోడ్‌లోనే ఈ కారు బ్యాటరీ సహాయంతో 40 కిమీ నుంచి 90 కిమీ వరకు ప్రయాణించగలదు.

నివేదికల ప్రకారం, ఈ కొత్త డాల్ఫిన్ G DM-i కారు హంగేరిలోని సెగెడ్ లో కొత్తగా నిర్మించబడుతున్న బీవైడీ తయారీ కర్మాగారంలో ఉత్పత్తి కానున్న మొదటి మోడళ్లలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్లాంట్ నుంచి భవిష్యత్తులో డాల్ఫిన్ సర్ఫ్, అట్టో 2, అట్టో 3 వంటి ఇతర మోడళ్లు కూడా ఉత్పత్తి కానున్నాయి. ఐరోపాలోనే లోకల్ ప్రొడక్షన్ చేయడం వల్ల బీవైడీకి అక్కడి స్థానిక కంపెనీలతో పోటీ పడటం ఈజీ అవుతుంది. అలాగే చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం, దానిపై ఆధారపడటం కూడా చాలా వరకు తగ్గుతుంది.

Tags:    

Similar News